అది ఫ్రెండ్‌షిప్‌డే రోజు కాదు..! తనకి శాశ్వత వీడ‍్కోలు రోజు..!! | - | Sakshi
Sakshi News home page

అది ఫ్రెండ్‌షిప్‌డే రోజు కాదు..! తనకి శాశ్వత వీడ‍్కోలు రోజు..!!

Published Tue, Aug 8 2023 12:24 AM | Last Updated on Tue, Aug 8 2023 7:45 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో పీజీ ఫస్టియర్‌ చదువుతున్న 9 మంది మిత్రులు ఆదివారం సాత్నాల వాగు సమీపంలోని కోటిలింగాల వద్దకు వెళ్లారు. వాగులో కాలుజారి భూక్యా ప్రవీణ్‌కుమార్‌ గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. జాలర్లు సోమవారం శవాన్ని బయటకు తీశారు. కళ్లకు గంతలు కట్టినట్లు ఉండటంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. ఆహ్లాదంగా గడిపిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోల్లో తలకు కర్చీప్‌ కట్టి ఉండటాన్ని పోలీసులు చూపించారు. ఏమైనా సందేహాలుంటే తమను సంప్రదించాలని జైనథ్‌ సీఐ కోలా నరేశ్‌కుమార్‌ సూచించారు. డైరెక్టర్‌ ఛాంబర్‌లో విహారయాత్రకు వెళ్లిన వైద్యులతో సీఐ సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చిన్నతనం నుంచే చదవుల్లో మేటి..
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన భూక్యా ఉస్మాన్‌ నాయక్‌ రాథోడ్‌–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శేఖర్‌ నాయక్‌ వ్యవసాయం చేస్తుండగా చిన్న కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఆర్థోపెడిక్‌ పీజీ ప్రథఽమ సంవత్సరం చదువుతున్నాడు. కాగా 1 నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాడు.

ఆ తర్వాత మొదటి ప్రయత్నంలో ఎంబీబీఎస్‌ సీటు సాధించగా హైదరాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత తన స్వంత జిల్లాలోని ముస్తాబాద్‌లోని పీహెచ్‌సీలో మూడు నెలలపాటు మెడికల్‌ ఆఫీసర్‌గా సేవలందించారు. పీజీ సీటు రావడంతో రిమ్స్‌లో చేరాడు. ప్రయోజకుడై కుటుంబానికి అండగా నిలుస్తాడని అనుకున్న కొడుకు కానరానిలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఉన్న రెండెకరాల భూమిని సాగు చేసి, కూలీ పనిచేస్తూ చదివించినట్లుగా పేర్కొంటూ రోదించడం అక్కడున్నవారిని కంటతడిపెట్టింది. కాగా బీఆర్‌ఎస్‌ నాయకుడు రంగినేని పవన్‌రావు ఫోన్‌లో బాధిత కుటుంబీకులను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు.

స్నేహితుల దినోత్సవం రోజే..
ఆదివారం స్నేహితుల దినోత్సవం ఉండటంతో 9 మంది తోటి స్నేహితులు తొలుత కుంభఝరి సమీపంలోని కోటి లింగాలను దర్శించుకున్నారు. వీరిలో నలుగురు పురుష వైద్యులు ఉండగా ఆరుగురు మహిళా వైద్యులు ఉన్నట్లుగా రిమ్స్‌ వర్గాలు తెలిపాయి.

ఆ తర్వాత సరాదాగా నీటిలో ఆటలాడుతూ ఉత్సాహంగా గడిపారు. ఇంటికి బయల్దేరే క్రమంలో నీటిని దాటుతుండగా ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌ నీటిలో పడిపోవడంతో దాన్ని తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బండపై నాచు ఉండటంతో కాలు జారి నీటిలో పడ్డాడు. స్నేహితులు కార్తీక్‌, రాజు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. ప్రవీణ్‌ గుండంలో చిక్కుకుపోయాడు.

వీరిద్దరిని కాపాడేందుకు మిగతా స్నేహితులు ప్రయత్నించగా వీరు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటికే ప్రవీణ్‌ గల్లంతయ్యాడు. డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, గ్రామస్తులు వాగు వద్దకు చేరుకున్నారు. రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, మరి కొందరు వైద్యులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల ద్వారా గాలింపు చేపట్టారు. రాత్రి 10 గంటల వరకు ఆచూకీ లభించలేదు.

దీంతో పోలీసులు, గ్రామస్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండేలా వలలు కట్టి ఉంచారు. సోమవారం ఉదయం 6 గంటలకే తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా 8 గంటల ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. రిమ్స్‌ మార్చురీలో పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు ప్రవీణ్‌ భౌతికకాయాన్ని అప్పగించారు.

కన్నీటి పర్యంతమైన రిమ్స్‌..
పీజీ విద్యార్థి మృతిచెందాడని తెలియగానే రిమ్స్‌ మెడికోలు, వైద్యులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం అనంతరం డైరెక్టర్‌ ఛాంబర్‌ ఎదుట మృతదేహాన్ని ఉంచి నివాళులర్పించారు. కుటుంబీకుల రోదనలతోపాటు తోటి పీజీ విద్యార్థులు, మెడికోలు కన్నీరుమున్నీరయ్యారు.

ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, సూపరింటెండెంట్‌ అశోక్‌, వైద్యులు సుమలత, శ్యాంప్రసాద్‌, వెంకట్‌రెడ్డి, జాడే తానాజీ, అధికారులు పార్థివదేహాంపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement