ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహణ కొనసాగిస్తోంది. ఈ విషయం విద్యా శాఖాధికారులకు తెలిసినప్పటికీ మామూలుగా వ్యవహరిస్తున్నారు. పాఠశాల యాజమాన్యానికి రాజకీయ అండదండలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడంతో జిల్లా విద్యాశాఖాధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.
ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో గల ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్నారు. అనుమతుల కోసం అక్టోబర్ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో వీరు ఆన్‌లైన్ చేసుకోలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకున్నప్పటికీ ఆన్‌లైన్‌లో మాత్రం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం నిబంధనలు మాత్రం పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాలకు అనుమతి లేదని విద్యానగర్‌కు చెందిన యువజన సంఘాలు, కాలనీవాసులు డీఈవోకు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇదిలా ఉండగా పాఠశాల యాజమాన్యానికి చెందిన పలువురు డీఈవో కార్యాలయానికి వెళ్లి త్వరగా అనుమతులు ఇవ్వాలని ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘కాసులిస్తే’ అన్నీ ఓకే..
గతంలో విద్యానగర్‌లోని ఇదే పాఠశాల భవనంలో ఓ ప్రైవేట్ పాఠశాల కొనసాగేది. ఆ భవనానికి ఫైర్ అధికారులు ఫైర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. పాఠశాల భవనం చుట్టూ వెళ్లే విధంగా లేదని, ఫైర్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆ యాజమాన్యం మరోచోట పాఠశాల నిర్వహణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భవనంలోనే కొనసాగుతున్న ఓ పాఠశాల యాజమాన్యానికి మాత్రం ఫైర్ అధికారులు అనుమతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కాసులిస్తే ఎలాంటి పనులైనా చేసుకోవచ్చనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ పాఠశాలకు ఫైర్ సర్టిఫికెట్ ఏ నిబంధనల మేరకు ఇచ్చారని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ కోరిన ఉన్నతాధికారులు జిల్లాకు చెందిన పలువురు ఫైర్ అధికారులకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయమై స్టేషన్ ఫైర్ అధికారి శివాజీని వివరణ కోరగా ఉన్నతాధికారి సెలవులో ఉన్నారని, తనకు ఈ విషయం తెలియదని వివరించారు.
తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం..
అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహణ కొనసాగించరాదు. ఆ పాఠశాల యాజమాన్యం గడువు లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి పొందారు. అయినప్పటికీ ఇంతవరకు ఆన్‌లైన్‌లో ప్రక్రియ పూర్తి కాలేదు. మాకు ఎలాంటి పత్రాలు సమర్పించలేదు. పాఠశాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. – ప్రణీత, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment