ఆదిలాబాద్: మండలంలోని గుండంపల్లి గ్రామ సమీపాన కాళేశ్వరం 27వ ప్యాకేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్ ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన ఆయా పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం కేటీఆర్ గుండంపల్లి చేరుకున్న తరుణంలో డీసీసీ అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావు నిరసన వ్యక్తం చేసేందుకు హెలీప్యాడ్ వద్దకు వెళ్తున్న తరుణంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు పూర్తి కాక మునుపే ప్రారంభోత్సవాలు చేయడం ఏమిటని శ్రీహరిరావు ప్రశ్నించారు. ఎత్తిపోతల పతకాలకు సంబంధిచి ప్యాకేజీ 27లోని మోటార్లకు ఇప్పటికీ విద్యుత్ సదుపాయం లేదని, కేటీఆర్ ప్రారంభోత్సవంలో సైతం చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి ఒక్క మోటారును ఆన్ చేశారని, అదీ కూడా ట్రయల్ రన్ మాత్రమేనని ఇది పూర్తి ప్రారంభోత్సవం కాదని శ్రీహరిరావు అన్నారు.
బీజేపీ నేతల అరెస్టు..
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ మండల నేతలైన డి.ముత్యంరెడ్డి, దిలావర్‌పూర్ సర్పంచ్ జంగం వీరేశ్‌తో పాటు మండల పార్టీ అధ్యక్షడు శైలేశ్వర్‌తో పాటు మరో 20మందిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి కేటీఆర్ పర్యటన అనంతరం బుధవారం వారిని వదిలి పెట్టారు. ఇది నియంతృత్వ పాలన అని సరైన సమయంలో ప్రజలు బుద్దిచెబుతారని వారు అన్నారు.
కేటీఆర్ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత!
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. దిలావర్‌పూర్‌లో ఉదయం స్థానిక ఆశా కార్యకర్తలు భిక్షాటన చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో తమ సమస్యలను కేటీఆర్‌కు విన్నవిస్తామని అక్కడకు తరలివెళ్లిన పలువురు ఆశా కార్యకర్తలను గుండంపల్లి గ్రామం వద్దనే నిలువరించడంతో స్వల్ప ఉద్రక్తత చోటుచేసుకుంది. కొంతమందిని పోలీసులు నిలువరించడంతో ఓ ఆశ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి ఆశాలు ఆమెకు నీరు తాగించి చెట్టునీడకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment