ఈశ్వర్(పైల్)
ఇచ్చోడ: భూవివాదంలో సొంత బాబాయ్ తన కుమారుడితో కలిసి యువకుడిని హత్య చేసిన సంఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. మూడెళ్లుగా అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న భూ వివాదమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని సాథ్‌నంబర్ గ్రామానికి చెందిన వానోలే కేదోబ, పాండురంగ్‌లు అన్నదమ్ములు.
కేదోబ ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా పనిచేసి నాలుగేళ్ల కిందట పదవీ విరమణ పొందాడు. పాండురంగ్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ రెండు నెలల కిందట గుండెపోటు రావడంతో ఫిట్‌నెస్ లేక డ్యూటీకి వెళ్లడం లేదు. ఇద్దరు అన్నదమ్ములకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి సాథ్‌నంబర్‌లోని జాతీయ రహదారికి ఆనుకొని ఉంది.
ఈ భూమి తల్లి పేరు మీద పట్టా ఉంది. కానీ గత సంవత్సరం కిందట పాండురంగ్‌కు తెలియకుండానే కేదోబ కుమారుడు ఈశ్వర్ (29) తన తండ్రి కేదోబ పేరిట ఎకరం, కేదోబ చెల్లెలు పేరిట మరో ఎకరం, తన పేరిటా ఎకరం ఇలా నాలుగు ఎకరాల భూమిని విరాసత్ ద్వారా పట్టాలు చేసుకున్నాడు. వారసత్వంగా వచ్చే భూమిలో వాటా ఇవ్వకుండా పట్టా చేసుకోవడంపై ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ప్రారంభమైంది.
ప్రస్తుతం భూ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ విషయంపై చాలసార్లు కుల పెద్దల మధ్య పంచాయితీ కూడా నిర్వహించారు. నెలరోజుల క్రితం ఈశ్వర్ తన తండ్రి కేదోబ పేర్ల మీద ఉన్న భూమిని కోటి రూపాయలకు విక్రయించినట్లు ప్రచారంలో ఉంది. తన వాటా దక్కకుండా భూ వివాదం కోర్టులో ఉండగా విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పాండురంగ్ ఈశ్వర్‌పై పగా పెంచుకున్నాడు.
మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో పాండురంగ్ తన కుమారుడు సూర్యకాంత్‌ను తీసుకొని సాథ్‌నంబర్ నుంచి ఇచ్చోడలోని సిరిచెల్మ చౌరస్తాలో ఈశ్వర్ కోసం కాపు కాశాడు. టీచర్స్‌కాలనీలో నివాసముండే ఈశ్వర్ ఉదయం 9గంటల ప్రాంతంలో ఇంటి నుంచి నడుచుకుంటూ సిరిచెల్మ చౌరస్తాలో పాన్‌టేలకు వెళ్లాడు. అక్కడ సమీపంలోని పాండురంగ్, సూర్యకాంత్‌లు ఈశ్వర్‌పై దాడికి ప్రయత్నించారు.
దీంతో ఈశ్వర్ తప్పించుకునే క్రమంలో సిరిచెల్మ రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు. పాండురంగ్, సూర్యకాంత్ వెంబడించి సాయిసామత్ ప్రైవేట్ కళాశాల ఎదుట ఈశ్వర్‌ను పట్టుకొని గొడ్డలితో నరికి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్సై నరేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment