గురువారం వరకు సర్వే వివరాలు
● జిల్లాలో 89శాతం ప్రక్రియ పూర్తి ● గ్రామీణ ప్రాంతాల్లోనే వేగవంతం ● నేటి నుంచి డాటా ఎంట్రీ షురూ.. ● ఇప్పటికే ఆపరేటర్లకు ప్రత్యేకశిక్షణ
కైలాస్‌నగర్: జిల్లాలో నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో తుది దశకు చేరింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 89శాతం పూర్తయింది. దీంతో అధికార యంత్రాంగం డాటా ఎంట్రీపై దృష్టి సారించింది. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 412 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఎంపిక చేసింది. వీరికి గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణకు గైర్హాజరైన వారికి ఆయా మండలాల్లో శుక్రవారం సూపర్‌వైజర్లు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన ఆపరేటర్లు నేటి నుంచి ఎన్యుమరేటర్లు సేకరించిన సర్వే వివరాలు నమోదు చేయనున్నారు. కాగా, మిగిలిపోయిన ఇళ్ల సర్వే ప్రక్రియను ఈ నెల 24లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
89శాతం సర్వే పూర్తి
ఈ నెల 6నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించాల్సి ఉండగా ప్రశ్నావలి పత్రాలు సకాలంలో రాక కొంత ఆలస్యమైంది. 8వ తేదీ వరకు హౌస్‌లిస్టింగ్ ప్రక్రియ చేపట్టిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఈ నెల 9నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించి కేటాయించిన బ్లాక్‌లలో కుటుంబీకుల సమాచారాన్ని సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 2,16,179 కుటుంబాలున్నట్లు గుర్తించిన అధికారులు వీరి సమాచార సేకరణకు 2,186 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 79శాతం సర్వే పూర్తి కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని 17 మండలాల్లో 91శాతం పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే వేగంగా సాగుతోంది. ఎన్యుమరేటర్లు నిర్వహించిన రోజువారీ సర్వే వివరాలను సూపర్‌వైజర్లకు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం నాలుగింటికి అందిస్తుండగా వారు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.
72 సెంటర్ల ద్వారా నమోదు
జిల్లా వ్యాప్తంగా 72 డాటా ఎంట్రీ సెంటర్లను గుర్తించిన అధికారులు కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక యూజర్ ఐడీలను క్రియేట్ చేశారు. పాస్‌వర్డ్‌లను వారు సొంతంగా క్రియేట్ చేసుకుని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా గురువారం కొన్ని ఫారాల సమాచారాన్ని నమోదు చేయించారు. ఒక్కో కుటుంబ సమాచారం నమోదు చేసేందుకు ఐదు నిమిషాలు పట్టినట్లు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ సామర్థ్యం, ఎన్యుమరేటర్ సేకరించిన సమాచారం స్పష్టత ఆధారంగా రోజువారీగా డీఈవోలకు ఫారాలు అందించనున్నారు. వివరాలు నమోదు చేశాక రోజువారీగా ఏ ఎన్యుమరేషన్ బ్లాక్‌లోని, ఎన్ని ఫారాల సమాచారాన్ని ఎంట్రీ చేశారనే సమాచారాన్ని పక్కాగా నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించనున్నారు. ఇందులో డీఈవో, సూపర్‌వైజర్ సంతకాలు తప్పనిసరిగా ఉండేలని కలెక్టర్ ఆదేశించారు.
ఆదిలాబాద్‌అర్బన్‌లో..
మొత్తం ఇండ్లు : 44,392
సర్వే పూర్తయినవి : 35,239
సర్వే శాతం : 79
మండలాల్లో..
మొత్తం ఇండ్లు : 1,73,096
సర్వే పూర్తయినవి : 1,57,553
సర్వే శాతం : 91
పొరపాట్లు జరగనివ్వొద్దు
సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎంట్రీ చేయాలి. రోజువారీగా ఆపరేటర్‌కు ఎన్ని ఫారాలను ఇస్తున్నారు, వాటి సమయం, తేదీ తదితర వివరాలు నమోదు చేసేలా రిజిస్టర్ నిర్వహించాలి. ఎన్యుమరేటర్‌తో పాటు సూపర్‌వైజర్‌ను ఎంట్రీ సమయంలో అందుబాటులో ఉంచుకోవాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకోవాలి. డాటా ఎంట్రీ ప్రక్రియను మండల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పపుడు పర్యవేక్షించాలి. సందేహాలుంటే మా దృష్టికి తేవాలి. – రాజర్షి షా, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment