ఆదిలాబాద్: పోలింగ్ సమయంలో బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసుల తీరు సరికాదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు తమ బాధ్యతను నిష్పక్షపాతంగా నిర్వర్తించాల్సింది పోయి, అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గోదావరిఖని, నస్పూర్, మంచిర్యాల పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కార్యకర్తలు నస్పూర్‌లో పోలీసుల సాయంతో బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేయించి స్టేషన్ తరలించారని ఆరోపించారు. అలాగే గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి న్యాయమూర్తులతో దురుసుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుస్తున్నారనే విషయాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేసిందన్నారు. ఓటర్లకు సైతం డబ్బులు పంచారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనను గమనించిన మేధావి వర్గమైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కారం కావాలంటే శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఉండాలని భావిస్తున్నారన్నారు. సమావేశంలో నాయకులు విజయ్, నగేష్, లాలా మున్నా, రఘుపతి, వేదవ్యాస్, దినేష్ మటోలియా, రాజన్న, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment