విధుల్లో నిర్లక్ష్యంపై కొరడా
● వైద్యాధికారితో పాటు సిబ్బందికి షోకాజ్ ● ఇంద్రవెల్లి పీహెచ్‌సీ తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా
ఇంద్రవెల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యసిబ్బందిని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు. హాజరు పట్టికలను పరిశీలించారు. వైద్యాధికారి శ్రీకాంత్‌తో పాటు సీహెచ్‌వో సందీప్, పీహెచ్‌ఎన్ జ్యోతి, సూపర్‌వైజర్ సురేశ్, ఎంఎల్‌హెచ్‌పీ పూజ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. వెంటనే వారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ను ఆదేశించారు. అదనపు ఏజెన్సీ వైద్యాధికారి మనోహర్‌తో ఫోన్‌లో మాట్లాడి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అలాగే మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని మందుల నిల్వగది, పలు ఇతర గదులను పరిశీలించారు. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని డాక్టర్ పూజితను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment