● నామ్‌కే వాస్తేగా సర్వే ● విద్యాశాఖవి కాకిలెక్కలే ! ●
ఆదిలాబాద్‌టౌన్: కార్ఖానాలు, ఇటుక బట్టీల్లో బాల్యం బంధీ అవుతోంది. అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు రోడ్లపైన, చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జీల్లో పనిచేసే వారు కొందరైతే.. భిక్షాటనతో పొట్టపోసుకునే వారు మరికొందరు. విద్యాహక్కు చట్టం, కార్మికశాఖ అటు వైపు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో బాల కార్మికులకు విముక్తి కలగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వీరి బతుకులు మాత్రం మారని పరిస్థితి. ఏటా డిసెంబర్, జనవరిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబయట పిల్లల సర్వే చేపడతారు. గతేడాది డిసెంబర్‌లో సర్వే నిర్వహించాల్సి ఉండగా, సీఆర్పీలు సమ్మెలో ఉండడంతో ఆలస్యమైంది. అనంతరం కేవలం పది రోజులు మాత్రమే నామ్‌కే వాస్తే సర్వే చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా మరో కారణమే ఆరోపణలున్నాయి. ఫలితంగా సర్కారు లక్ష్యం నెరవేరని పరిస్థితి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో బడిబయట పిల్లల సర్వే గతేడాది డిసెంబర్ నుంచి జనవరి 26 వరకు జరగాల్సి ఉంది. అయితే సీఆర్పీలు డిసెంబర్ 8 నుంచి జనవరి 7వరకు సమ్మెలో ఉన్నారు. జనవరి 10 నుంచి 26 వరకు సర్వే నిర్వహించారు. జిల్లాలో 58 మంది సీఆర్పీలు ఉన్నారు. ఒక్కో సీఆర్పీకి 15 నుంచి 20 గ్రామాలు కేటాయించారు. అయితే కొంతమంది గత లెక్కలనే తక్కువ ఎక్కువ చేసి ప్రబంధ పోర్టల్‌లో నమోదు చేసినట్లు సమాచారం. వారు ఇచ్చిన లెక్కల ప్రకారం జిల్లాలో 6–14ఏళ్ల లోపు వారు 369 మంది ఉండగా, 15–19 ఏళ్లలోపు వారు 58 మంది ఉన్నట్లు చెబుతున్నారు. గతేడాదికి సంబంధించి 6–14 ఏళ్లలోపు వారు 563 ఉండగా, 15–19 ఏళ్లలోపు వారు 121 ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో అత్యధికంగా ఆదిలాబాద్‌అర్బన్, ఉట్నూర్, బోథ్‌లో 42 మంది చొప్పున, ఆదిలాబాద్‌రూరల్‌లో 40, నేరడిగొండలో 34, భీంపూర్‌లో 36, గాదిగూడ, గుడిహత్నూర్‌లో 22 మంది చొప్పున, బజార్‌హత్నూర్, బజార్‌హత్నూర్‌లో 17మంది చొప్పున, ఇంద్రవెల్లిలో 10, సిరికొండలో 8, నార్నూర్‌లో 7, అత్యల్పంగా మావలలో ముగ్గు రు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. జిల్లాలో దాదాపు 500 మందికి పైగా 6–14 ఏళ్లలోపు వారు ఉన్నట్లు తె లుస్తోంది. జిల్లా కేంద్రంలోనే దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు సమాచారం. బస్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లలో పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు.
సర్వే నిర్వహిస్తున్న సీఆర్పీలు (ఫైల్)
పకడ్బందీగా నిర్వహించాం..
బడి బయట పిల్లల సర్వేను సీఆర్టీల ద్వారా నిర్వహించాం. జిల్లాలో 6–14 ఏళ్ల లోపు పిల్లలు 369 మంది ఉన్నట్లు గుర్తించాం. వచ్చే విద్యా సంవత్సరంలో వీరందరినీ బడిలో చేర్పిస్తాం. అలాగే 15 నుంచి 19 సంవత్సరాల వారు 58 మంది ఉన్నారు. వీరిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదివించేలా చర్యలు చేపడతాం.
– ప్రణీత, డీఈవో
నెరవేరని లక్ష్యం..
విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలో పు పిల్లలు బడిబయట ఉండకూడదు. ఉచిత ని ర్బంధ విద్య అమలు చేయాలి. అయితే సర్కారు లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది. బడిబయ ట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ త ర్వాత పాఠశాలకు వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించడం లేదు. దీంతో బడిలో చేరిన పిల్లలు తిరి గి బయటకు వెళ్లిపోతున్నారు. ఏడాదికేడాది బడిబయట పిల్లల సర్వే ఒక్కో రకంగా ఉంటోంది. ఏడాదికి రెండు సార్లు పోలీసు, బాలల సంరక్షణ ఆధ్వర్యంలో స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ పనిచేస్తు న్న వారిని విముక్తి కలిపించి బడిలో చేర్పిస్తున్నప్పటికీ వారు చదువు కొనసాగించలేకపోతున్నా రు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు బడికి రాకపోయినప్పటికి హాజరు పట్టికలో వారు పేర్లు అలాగే ఉంటున్నాయి. ఉపాధ్యాయ పోస్టులు సర్దుబాటు చేస్తారనే ఉద్దేశంతో ఖాకీ లెక్కలు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బడిబయట ఉన్న పిల్లల్ని గుర్తించిన వారిని పూర్తిస్థాయిలో బడిలో చేర్పిస్తే బాల్యం బంగారు భవిష్యత్తుగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment