కోచింగ్.. ఇక భారమే!
● స్విమ్మింగ్‌పూల్ నిర్వహణ ప్రైవేట్‌కు.. ● టెండర్ ద్వారా అప్పగించేందుకు రంగం సిద్ధం ● ఇకపై వారు నిర్ణయించేదే ఫీజు ● స్విమ్మర్లపై పడనున్న ఆర్థిక భారం
త్వరలో టెండర్ నోటిఫికేషన్
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్విమ్మింగ్‌పూల్ నిర్వహణకు సంబంధించి టెండర్ నిర్వహణ ఉంటుంది. ఓపెన్ యాక్షన్ పద్ధతిలో సాగే ఈ టెండర్‌లో ఏడాదికి రూ.10.89లక్షలు అంచనా వ్యయం రూపొందించడం జరిగింది. రూ.2లక్షల ఈఎండీ చెల్లించి టెండర్‌లో పాల్గొనాలి. పూర్తి విధి విధానాలను త్వరలో ప్రకటిస్తాం. – తిరుపతి, డీఈ, మున్సిపాలిటీ
అనుభవజ్ఞులతో కోచింగ్ ఇచ్చేలా చూస్తాం
ప్రైవేట్ వ్యక్తులకు స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను అప్పగిస్తున్నా అనుభవజ్ఞులైన స్విమ్మింగ్ కోచ్‌ల ద్వారా శిక్షణ ఇచ్చేలా చూస్తాం. ఇవీ టెండర్ నిబంధనలో ఉన్నాయో లేవో తెలియవు. అయితే మున్సిపాలిటీ నుంచి టెండర్లు నిర్వహించి సక్సెస్‌పుల్ బిడ్డర్ ఎవరనేది మాకు తెలియపరుస్తారు. హైజనిక్ పద్ధతిలో ఈత కొలను నిర్వహణను చేసేలా చూస్తాం.
– వెంకటేశ్వర్లు, డీవైఎస్‌వో
సాక్షి, ఆదిలాబాద్: వేసవి వచ్చిందంటే జిల్లా కేంద్రంలోని స్టేడియంలో గల స్విమ్మింగ్‌పూల్ సందడిగా మారుతోంది. సెలవుల్లో చిన్నారులు ఈత నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటారు. పెద్దలు సైతం వేసవి తాపం నుంచి సేదతీరేందుకు స్విమ్మింగ్ వైపు ఆసక్తి కనబరుస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో స్విమ్మింగ్‌పూల్ నిర్వహణ ఉంటే ఫీజులు అదుపులో ఉండేవి. అయితే ఇకపై ఆ పరిస్థితి మారనుంది. అధికారికంగా టెండర్ ద్వారా ఈ స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను కాంట్రాక్టర్ చేతిలో పెట్టనున్నారు. దానికి రంగం సిద్ధమైంది. ఆ కాంట్రాక్టర్ ఇష్టారీతిన ఫీజులు నిర్దేశించే అవకాశముంది. దీంతో స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకునే అనేక మంది చిన్నారులకు ఇది ప్రతిబంధకంగా మారే పరిస్థితి లేకపోలేదు.
ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నాలుగు దశాబ్దాలుగా స్విమ్మింగ్‌పూల్ ని ర్వహణ కొనసాగుతుంది. మొదట్లో కోచ్‌ను నియమించి చిన్నారులకు శిక్షణ ఇచ్చేవారు. ఏటా వేసవి వచ్చిందంటే సెలవుల్లో వందలాది చిన్నారులు కోచింగ్ కోసం బారులు తీరేవారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో పలువురు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ కనబరిచారు. జిల్లాకు వన్నె తెచ్చారు. ఇదంతా ఒకప్పటి మాట. గడిచిన దశాబ్దన్నరగా ఈ స్విమ్మింగ్ పూల్ పూర్తిగా నిరాదరణకు గురవుతోంది. సరైన కోచ్‌లను నియమించకపోవడం, దాని నిర్వహణను అంతగా పట్టించుకోకపోవడంతో చిన్నారులు కోచింగ్‌లా కాకుండా ఏదో వేసవిలో ఆట విడుపుగా మాత్రమే ఇక్కడ స్విమ్మింగ్ పరిమితంగా మారింది. అంతే కాకుండా ఈత మంచి ఎక్సర్‌సైజ్‌గా భావించి పలు వురు యువకులు, పెద్ద వయ స్సు వారు ఇందులో స్విమ్మింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా వ్యవహారం మారుతోంది. టెండర్ ద్వారా ఈ స్విమ్మింగ్‌పూల్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనుండటంతో ఇకపై నామమాత్రపు ఫీజులు ఉండవు. అలాగే దీని ద్వారా ఆదాయం ఆశించే కాంట్రాక్టర్ కోచ్‌లను నియమించి శిక్షణ ఇస్తాడనుకోవడం పొరపాటే అవుతోంది. మొత్తంగా ఆదిలాబాద్ స్విమ్మింగ్‌పూల్ కల తప్పిపోనుంది.
టెండర్‌కు రంగం సిద్ధం
ఈ స్విమ్మింగ్‌పూల్‌ను రెండేళ్ల క్రితం ఇందులో శిక్షణ ఇచ్చే ఓ ప్రైవేట్ కోచ్‌కు లీజుకు ఇచ్చారు. అప్పుడు టెండర్ విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి స్విమ్మింగ్ కోచ్ కావడంతో అంతగా విమర్శలు రాలేదు. అంతే కాకుండా గతం నుంచి చిన్నారులకు కొనసాగుతు న్న శిక్షణను కొనసాగించడంతో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అప్పట్లో ఏడాదికి రూ.9.90లక్షలు చెల్లించేలా ఈ కోచ్‌కు స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను అప్పగించారు. అయితే తాజాగా దీని నిర్వహణను తొలిసారి అధికారికంగా టెండర్ నిర్వహించి ప్రైవేట్ వ్యక్తులకు ఏడాది పాటు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపెన్ టెండర్ విధానంలో ఏడాదికి రూ.10.89లక్షలు దీని అంచనా వ్యయంగా రూపొందించారు. అంత కంటే అధికంగా కోట్ చేసిన వారికి నిర్వహణను అప్పగిస్తామన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్ చేస్తుండగా ఈ బాధ్యతను మున్సిపాలిటీకి అప్పగించారు.
ప్రమాణాలే లేవు
ఓపెన్ టెండర్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైనప్పటికీ ఈ పద్ధతిలో ఏమైన ప్రమాణాలు, నిబంధనలు పెట్టారా అంటే అలాంటివి లేనేలేవు. ఎవరు ఎక్కువ ధర కోట్ చేస్తే ఆ కాంట్రాక్టర్‌కు నిర్వహణను అప్పగించనున్నారు. తద్వారా ఇది పూర్తిగా వ్యాపార ధోరణిగా మార్చేస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఒకప్పుడు కలెక్టర్‌గా కొనసాగిన వారు ఇక్కడ స్విమ్మింగ్ శిక్షణకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు. ఫలితాలు కూడా తదనుగుణంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్ ఈ విషయంలో దృష్టి సారించాలనే అభిప్రాయం పలువురు నుంచి వ్యక్తమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment