‘భూసార’ంతో అధిక దిగుబడి
● ఏటా వేసవిలో మట్టి నమూనా పరీక్షలు ● అవగాహన లేమితో దృష్టి సారించని రైతులు ● వినియోగించుకోవాలంటున్న వ్యవసాయ అధికారులు
బోథ్: వ్యవసాయ పొలాలు ఏ రకమైన పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి.. భూమిలోని పోషకాల స్థాయి.. ఎలాంటి ఎరువులు ఏ సందర్భాల్లో ఉపయోగించాలనే విషయాలపై రైతులకు అవగాహన కలగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు తోడవడంతో అన్నదాతలు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో భూసార పరీక్షలు నిర్వహించి వాతావరణ పరిస్థితులకు తగిన పంటలు సాగుచేస్తే ఆశించిన దిగుబడులు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామంది రైతులు ఈ పరీక్షలు చేయించడం లేదు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో..
అదిలాబాద్ జిల్లాలో 101 క్లస్టర్లు ఉన్నాయి. వాటి పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో సుమారు రెండు లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. ఏటా వర్షాకాలం, యాసంగిలో పత్తి, సోయా, పెసర, మినుము, జొన్న, మొక్క జొన్న, శెనగ, కంది తదితర పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఎరువులు ఎంత మోతాదులో వాడాలి.. భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉందో తెలియకపోవడంతో సాగులో పెట్టుబడి పెరిగి ఆశించిన దిగుబడి రాని పరిస్థితి. ఫలితంగా అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు.
అవగాహన లేమితో వెనుకంజ..
రైతులు పంటల సాగులో విరివిగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో సాగు వ్యయం పెరగడంతో పాటు భూమిలో పోషక విలువలు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలియక అవసరానికి మించి క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. భూసార పరీక్షల ప్రాధాన్యంపై సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయ శాఖ పదేపదే చెబుతున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మరోవైపు భూసార పరీక్షల ఫలితాలను సైతం అధికారులు సమయానికి అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫలితాల ఆధారంగా..
భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఫలితాలను అనుసరించి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లోని ఉదజని, లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్‌ల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అవసరమైన మోతాదులో ఎరువులు వినియోగించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను ఆశ్రయించి వారు సూచించిన వంగడాలను ఉపయోగిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది.
రైతులు వినియోగించుకోవాలి
రైతులు తమ భూమికి సంబంధించిన భూసార పరీక్షలు ఏటా చేయించుకోవాలి. దీంతో భూసారం తెలుస్తుంది. అవసరమైన పోషకాలు అందించి దిగుబడి పెంచుకోవచ్చు. ఏప్రిల్,మే నెలలో ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం ఆయా క్లస్టర్లలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా నేరుగా వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి. ఇవి పూర్తిగా ఉచితం. వారం రోజుల్లో రిపోర్టు అందేలా చర్యలు చేపడుతున్నాం. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి.
– శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయధికారి
Comments
Please login to add a commentAdd a comment