నిబంధనలు తూచ్..
● అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణ ● ప్రభుత్వానికి పన్ను చెల్లించని నిర్వాహకులు ● కార్మికులకు కరువైన వసతులు ● అయినా పట్టించుకోని అధికారులు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఇటుక బట్టీల దందా జోరుగా సాగుతోంది. నిర్వాహకులు నిబంధనలు పాటించకున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటుక బట్టీ వ్యాపారం చేసే ముందు గ్రామపంచాయతీ, ఇండస్ట్రీయల్, మైనింగ్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే జిల్లాలో ఏ వ్యాపారి కూడా ఈ అనుమతులు తీసుకోకుండా దందా నిర్వహిస్తుండడం గమనార్హం. వీరంతా రూ. లక్షల్లో ఆదాయం గడిస్తున్నా సర్కారుకు రూపాయి పన్ను చెల్లించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఇందులో పనిచేసే కార్మికులకు సైతం కనీస సౌకర్యాలు అందని పరిస్థితి. వారి పిల్లల బాల్యం సైతం బట్టిల్లోనే మగ్గుతోంది. చిరుప్రాయంలోనే ఆ పసి మొగ్గలు బాల కార్మికులుగా మారుతున్న దుస్థితి.
కార్మికులకు సౌకర్యాలు కరువు
జిల్లా వ్యాప్తంగా దాదాపు వందకు పైగా ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. అయితే నిర్వాహకులు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. మావల మండల కేంద్రం, బట్టిసావర్గాం, ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడ, అంకోలి, తంతోలి, బంగారుగూడ, తలమడుగు మండలంలోని కజ్జర్ల, ఉండం, తాంసి, భీంపూర్, ఇంద్రవెల్లి తదితర మండలాల్లో ఈ బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో పనిచేసేందుకు కార్మికులను జిల్లాతో పాటు మహా రాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి నిర్వాహకులు తీసుకొస్తున్నారు. ఊరికి దూరంగా, అటవీ ప్రాంతాలు, పంట పొలాల్లో బట్టీలను నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కార్మికులకు కనీస సౌకర్యాలు ఉండవు. చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళలో విషకీటకాల బారిన పడిన ఘటనలు సైతం ఉన్నాయి.
బట్టీల్లోనే బాల్యం..
వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్ల లు సైతం ఇటుక బట్టీల్లోనే పనులు చేస్తున్నారు. ని బంధనల ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు వారు ఎ లాంటి పనులు చేయడానికి వీల్లేదు. అయితే ఏ బట్టీ వద్ద చూసినా బాలకార్మికులు దర్శనమిస్తుండడం గమనార్హం. బడిలో గడపాల్సిన బాల్యం బట్టీల్లో మగ్గుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నోటీసులు జారీ చేస్తాం..
నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు చేపడతాం. వ్యాపారులు సంబంధిత గ్రామపంచాయతీ, ఇండస్ట్రీయల్ అనుమతి పొందిన తర్వాత మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక సర్టిఫికెట్ జారీ చేస్తాం. పంచాయతీ శాఖ అధికారుల నుంచి ఏయే జీపీల్లో ఇటుక బట్టీలు ఉన్నాయో వివరాలు సేకరిస్తాం.
– రవీందర్, మైనింగ్ ఏడీ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment