● ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటిమట్టం ● అడుగంటుతున్న మత్తడివాగు, సాత్నాల ● యాసంగి పంటలకు అందని సాగునీరు ● ఆందోళనలో ఆయకట్టు రైతులు
ప్రాజెక్టు నీటిమట్టం (మీటర్లలో) నిల్వ సామర్థ్యం (టీఎంసీలో)
పూర్తిస్థాయి ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రస్తుతం
మత్తడివాగు 277.50 272.90 0.571 0.146
సాత్నాల 286.50 279.90 1.24 0.196
తాంసి: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే గ్రామాల్లో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టులు సైతం అడుగుంటుతున్నాయి. మరోవైపు పంట చేలల్లో బావులు, బోరుబావుల్లో భూగర్భజల మట్టం పడిపోతుంది. చాలా చోట్ల పంటలు వాడిపోయి ఎండిపోతున్నా యి. తాంసి మండలం వడ్డాడి శివారులో ఉన్న మత్తడివాగు ప్రాజెక్టు, సాత్నాల మండలంలోని సాత్నా ల ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం వీటి పరిధిలోని ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మత్తడివాగు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా తాంసి, భీంపూర్, ఆదిలా బాద్ రూరల్ మండలాల్లోని సుమారు 8,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఇక సాత్నాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా జైనథ్, సాత్నాల మండలాల్లోని సుమారు 26వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ఎండల ప్రభావంతో ఈ ప్రాజెక్టులు క్రమంగా డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నాయి. మరోవైపు భూగర్భ జలా ల మట్టం కూడా పడిపోతుండడంతో రైతులు ఎండిన పంటలు చూసి తమ ఆశలు ఆవిరైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, గోధుమ తదితర పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరందక ఎండిపోతున్నాయి. మార్చిలోనే పరి స్థితి ఇలా ఉంటే మేలో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎండిపోతున్న మత్తడివాగు ప్రాజెక్టు
సరిపడా నీరు ఉంది
ఎండల తీవ్రత పెరగడంతో ప్రాజెక్టులో నీరు వేగంగా తగ్గుతుంది. అయినా ఎడమకాలువ ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నాం. ప్రాజెక్టులో ప్రస్తుతం 272.90 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– హరీశ్ ఏఈ, మత్తడివాగు ప్రాజెక్టు
సాగునీటికి ఇబ్బందవుతుంది..
మత్తడివాగు ఎడమ కాలువపై ఆధారపడి నాలుగు ఎకరాల్లో జొన్న వేశాను. గోట్కూరి శివారులో ఉన్న చేనుకు కాలువ ద్వారా నీరందడం లేదు. ఎగువన ఉన్న రైతులు కాలువలో అడ్డుగా కట్టలు వేసి నీటిని వాడుకుంటున్నారు. దీంతో నీరు కిందికి రావడం లేదు. దూరంగా ఉన్న ప్రధాన కాలువల్లో మోటార్ ఏర్పాటు చేసి నీటిని అందించాల్సి వస్తోంది. చానా ఇబ్బంది అవుతుంది.
సురేశ్, రైతు, జందాపూర్
ఇక్కడ సాగునీరందక ఎండిపోయి కనిపిస్తున్న ఈ జొన్నపంట తాంసి మండలంలోని గోట్కూరి శివారులోనిది. జందాపూర్ గ్రామానికి చెందిన ఉష్కముల్ల చందు తనకున్న రెండున్నర ఎకరాల్లో మత్తడివాగు ప్రాజెక్టు ఎడమకాలువ కింద యాసంగిలో జొన్న సాగు చేశాడు. అయితే గోట్కూరి శివారులో ఉన్న కాలువకు నెల క్రితమే సాగునీరు నిలిచిపోయింది. మరోవైపు చేలో ఉన్న బోరుబావి సైతం అడుగంటింది. పంట దాదాపు సగానికి పైగా ఎండిపోయింది. ఉన్న కొద్దిపాటి నీటితో ప్రస్తుతం ఎకరం వరకే నీరందుతుంది. ఈ ఒక్క రైతే కాదు.. మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలోని చాలా మంది రైతులది ఇదే పరిస్థితి.
ఎండుతున్న ఆశలు
ఎండుతున్న ఆశలు