టెక్నాలజీ ఉపయోగించి దొంగతనాలు
పెరిగిన గొలుసు, వాహన చోరీలు
సీసీ నిఘా ఉన్నా తప్పించుకుంటున్న నిందితులు
మావల మండల పరిధిలోని దస్నాపూర్‌లో గల నేషనల్ మార్ట్‌లో ఇటీవల ఓ దొంగ టెక్నాలజీ ఉపయోగించి చోరీకి పాల్పడ్డాడు. పైన రేకుల బోల్టులను తొలగించి లోనికి చొరబడ్డాడు. లాకర్‌ను కటర్‌గ్రైండర్‌తో ఓపెన్ చేసి అందులోని రూ.4లక్షలకు పైగా నగదును ఎత్తుకెళ్లాడు. చొరబడిన ఫుటేజీలు సీసీ కెమెరాలో రికార్డు కాగా, ఆ తర్వాత సీసీ కెమెరా కనెక్షన్ తొలగించాడు.
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఇటీవల దొంగతనాలు పెరిగిపోయాయి. టెక్నాలజీ ఉపయోగించి కేటుగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళల్లో దుకాణాలు, మాల్స్, తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనం కనిపిస్తే మాయం చేస్తున్నారు. మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా వాటికి చిక్కకుండా జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన చోరీలు తాజాగా మళ్లీ మొదలవడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దొంగలు దినమంతా రెక్కీలు నిర్వహించి రాత్రి వేళల్లో తమ పని కానిచ్చేస్తున్నారు. కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వీరిని పోలీసులు సైతం వెంటనే పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సందర్శిస్తే తమకు సమాచారం అందించాలని చెబుతున్నారు.
ఆగని చోరీలు..
జిల్లాలో కొంతకాలంగా చోరీలు ఆగడం లేదు. ఆయా ప్రాంతాల్లో దొంగలు ఉదయం పూట రెక్కీ నిర్వహిస్తున్నారు. చిరు వ్యాపారులుగా, భిక్షాటన చేస్తూ తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. రాత్రి సమయంలో అందులోకి చొరబడి తమ పని కానిచ్చేస్తున్నారు. అలాగే ఇళ్ల ముందర పార్కింగ్ చేసిన బైక్‌లు, రిమ్స్ ఆస్పత్రి, ఆయా షాపుల ఎదుట పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లి మహారాష్ట్రలో విక్రయిస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సంపాదించిన ధనం దొంగల పాలు కావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 350కి పైగా దొంగతనాలు జరిగాయి. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని నేషనల్ మార్ట్‌లో రూ.4లక్షలకు పైగా ఎత్తుకెళ్లారు. దొంగల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
సీసీ కెమెరాలకు చిక్కకుండా..
జిల్లా కేంద్రంలోని ఆయా ముఖ్య కూడళ్లతో పాటు కాలనీల్లో 200 వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిని పోలీసు కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులు జరగడంతో పలుచోట్ల ఈ కెమెరాలు పనిచేయడం లేదు. అలాంటి ప్రాంతాల్లో చోరీలు జరిగినప్పుడు దొంగలను పట్టుకోవడం కొంత ఇబ్బందిగా మారుతుంది. సీసీ కెమెరాల ఆవశ్యకతపై దుకాణదారులతో పాటు ఆయా గ్రామాల్లో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
పెట్రోలింగ్‌తో నిఘా ఏర్పాటు చేశాం..
దొంగతనాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచి నిఘా కట్టుదిట్టం చేస్తున్నాం. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. దుకాణాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. షాపుల్లో నగదును పెద్ద మొత్తంలో ఉంచవద్దు. సాంకేతిక పద్ధతులు ఉపయోగించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
– అఖిల్ మహాజన్, ఎస్పీ