
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
కై లాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న చేపట్టనున్న అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమ్మె వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులు ఏళ్ల తరబడి అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా సవరణలు చేస్తూ నాలుగు లేబర్ కోడ్‌లుగా విభజించిందన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో ప్రైవేటీకరణను మరింత వేగవంతం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక, ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను దూరం చేసిందని ఆరోపించారు. కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా సమ్మెకు సిద్ధం కావాలని కోరారు. ఇందులో కూరపాటి రమేశ్, బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, మల్లేశ్, చిన్నన్న, నవీన్‌కుమార్, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.