బెట్టింగ్‌పై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌పై ఉక్కుపాదం

Apr 2 2025 1:04 AM | Updated on Apr 2 2025 1:04 AM

బెట్టింగ్‌పై ఉక్కుపాదం

బెట్టింగ్‌పై ఉక్కుపాదం

● యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ● వన్‌టౌన్‌ పరిధిలో ఇద్దరిపై కేసు ● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని, ఈ యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లాలో ఇద్దరిపై బెట్టింగ్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా డైట్‌ కళాశాల మైదానంలో కొందరు ఆన్‌లైన్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈమేరకు దాడిచేయగా రామాయి గ్రామానికి చెందిన షేక్‌ సాజిద్‌ (ఏ–1), పట్టణానికి చెందిన సాయికుమార్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడుతున్నట్లు నిర్ధారణ అయినట్లు చెప్పారు. వారి నుంచి రూ.1500 నగదుతో పాటు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లకు బానిసవుతున్నారని పేర్కొన్నారు. అప్పుల పాలై ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ప్లే కార్డ్‌, గేమ్స్‌ కట్టడికి జిల్లా పోలీస్‌ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, బెట్టింగ్‌ ప్రోత్సహించినా, నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలు బి.సునీల్‌ కుమార్‌, కరుణాకర్‌రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

డయల్‌ 100 సిబ్బంది త్వరితగతిన స్పందించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: డయల్‌ 100కు కాల్‌ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. పోలీస్‌ పరేడ్‌ మైదానంలోని సమావేశ మందిరంలో బ్లూకోర్ట్‌, డయల్‌ 100 సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్‌, నాగేందర్‌, సీఐలు భీమేష్‌, గుణవంతరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement