
ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై గందరగోళం
అందుబాటులో రక్షణశాఖ భూములు
ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు సమయంలోనే అదనంగా భూముల అవసరం పడేనా?
విధివిధానాలు వస్తేనే రానున్న స్పష్టత
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవిష్యత్‌లో ఎయిర్‌ఫోర్స్ కూడా ఇక్కడే ఏర్పాటు చే స్తామని ప్రకటించడం ఈ ప్రాంతవాసులను సంబ రాల్లోకి నెట్టింది. గతంలో భూసేకరణకు చేపట్టిన సర్వే ప్రకారం ఆ భూముల సేకరణపై యజమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వారు అధికారులు, నేతలను కలుస్తున్నారు. భూ సేకరణ విషయమై ఫోన్‌లో వాకబు చేస్తున్నారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎయిర్‌పోర్టుకు సరిపోతుందా..
ఆదిలాబాద్‌లో రక్షణశాఖకు సంబంధించి వాయుసేన భూమి 369 ఎకరాలు ఉంది. ఇది నిజాం కాలంలో విమానాల రాకపోకలకు సంబంధించి ఇంధన స్టేషన్‌గా ఉండేదని తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో రక్షణశాఖ పరిధిలోకి ఈ భూములు వచ్చేశా యి. అయితే ఆదిలాబాద్‌లో ఇన్ని ఎకరాల భూములుండటం, హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు మధ్యలో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అన్ని విధాలా అనువుగా ఉంటుందనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఇందుకు అనుగుణంగా గతం నుంచే పలుసార్లు వాయుసేనకు సంబంధించిన వారు ఈ భూముల రక్షణ విషయంలో పరిశీలనకు రావడంతో పాటు భవిష్యత్‌లో ఇక్కడ వైమానిక శిక్షణ దళం ఏర్పాటు చేస్తామని సంకేతాలిస్తూ వచ్చారు.
అయితే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందనే డిమాండ్ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వారు కూడా పలుసార్లు ఇక్కడికి పరిశీలనకు వచ్చారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారనే ప్రచారం ముందు నుంచే ఉంది. అయితే ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుందా.. లేదా ఎయిర్‌ఫోర్స్ వస్తుందా.. అనే సందిగ్ధం అప్పట్లో వెంటాడేది. తాజాగా ఈ రెండూ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పడంతో ప్రస్తుతం భూముల విషయంలో అందరి మదిలో ఆలోచనలు మొదలయ్యాయి.
గతంలో సఖ్యత లేకే..
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన స ఖ్యత లేక ఈ ప్రణాళిక ముందుకు సాగలేదు. తాజా గా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరడం, కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా ముందుకు రావడంతో ముందడు గు పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రక్షణ శాఖ అధీనంలోని వందల ఎకరాల భూములే ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సరిపోతాయా.. లేదా అదనంగా భూమిని సేకరించాల్సి వస్తుందా.. అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.
డీపీఆర్ కోరిన నేపథ్యంలో..
ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనుమతిస్తూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డిటేల్ ప్రాజెక్ట్ రిపో ర్టు (డీపీఆర్) ఇవ్వాలని కోరింది. దీంట్లో రన్‌వే, సివిల్ టర్మినల్, ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ ఆఫ్రాన్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి దీనిని అడిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూప డం, రానున్న రోజుల్లో ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసినా దానికి ఉపయోగపడేలా ఎయిర్‌పోర్టు ఉండాలని కేంద్రం ఆలోచనతో రక్షణ శాఖ భూములనే సంయుక్తంగా వినియోగించుకునేందుకు ఈ డిటేల్ ప్రా జెక్ట్ రిపోర్టు అడిగిందని పలువురు నిపుణులు చెబు తున్నారు. అయితే దీని విషయంలో పూర్తి విధివిధానాలు ప్రభుత్వం నుంచి వస్తేనే ఏదైన చెప్పగలుగుతామని అధికారులు పేర్కొంటున్నారు.
ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసేటప్పుడే..
ప్రస్తుతం రక్షణ శాఖ అధీనంలోని వందల ఎకరాల భూములను ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు వినియోగించుకుంటే ఇప్పటికిప్పుడే అదనంగా భూసేకరణకు ఆవశ్యకత ఉండదని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసే సమయంలో అదనంగా భూమి సేకరించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో సర్వే చేసిన 1,592 ఎకరాల ఆవశ్యకత ఇప్పటికిప్పుడే ఉండదని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసేటప్పుడే ఆ భూముల సేకరణ తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని మోదీ కృషి ఫలితమే..
ఆదిలాబాద్: ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృషితోనే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్‌లో ప్రధాని మోదీ, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు కోసం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృషి చేశారని, ఎంపీ గోడం నగేశ్ పార్లమెంట్‌లోనూ ప్రస్తావించారని పేర్కొ న్నారు. ప్రధాని మోదీ, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పట్టణాధ్యక్షుడు వేదవ్యాస్, నాయకులు మహేందర్, ప్రవీణ్, విజయ బోయర్, రాకేశ్, అర్జున్, దినేశ్, సుభాష్, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ చొరవతోనే..
కైలాస్‌నగర్: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు భారత వాయుసేన అనుమతులివ్వడం సీఎం రేవంత్‌రెడ్డి చొరవతోనే సాధ్యమైందని డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, కంది శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబా ద్‌కు ఎయిర్‌పోర్టు మంజూరు చేయాలని పార్లమెంట్ ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.