విద్యార్థులకు ఫౌండేషన్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఫౌండేషన్‌

Apr 4 2025 2:07 AM | Updated on Apr 4 2025 2:07 AM

విద్య

విద్యార్థులకు ఫౌండేషన్‌

● సంక్షేమ గురుకులాల్లో ఫౌండేషన్‌ కోర్సులు ● ఎనిమిదో తరగతి నుంచి శిక్షణకు నిర్ణయం ● మెరిట్‌ విద్యార్థులకు ప్రాధాన్యత ● వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం

బెల్లంపల్లి: తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మహర్దశ రానుంది. ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా గురుకుల విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచే ఫౌండేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శి అలుగు వర్షిణి ఫౌండేషన్‌ కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 గురుకుల కళాశాలల్లో ఫౌండేషన్‌ కోర్సులను ప్రారంభించనున్నారు. ఐఐటీ జేఈఈ, నీట్‌, యూపీఎస్‌సీ, సీయూఐటీ, సీఎల్‌ఏటీ వంటి తదితర అత్యంత ప్రాధాన్యత కలిగిన కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నారు. 2025 –26 విద్యాసంవత్సరం నుంచి ఫౌండేషన్‌ కోర్సుల్లో శిక్షణ ప్రారంభించనున్నారు.

ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక

ఫౌండేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇప్పించడానికి ఆసక్తి కలిగిన ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో 8వ తరగతిలో ప్రవేశం పొందనున్న విద్యార్థులకు సైతం పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. ప్రవేశపరీక్షలో మెరిట్‌ మార్కులు పొందిన విద్యార్థులను ఎంపిక చేసి ఫౌండేషన్‌ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తద్వారా ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

కళాశాలల ఎంపికపై ఆసక్తి

ఫౌండేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇప్పించడానికి ఏయే కళాశాలలను ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాబోధనలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న గురుకుల విద్యాలయాలను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీవోఈ ) కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో ఉన్న ప్రధాన క్యాంపస్‌ తోపాటు కరీంనగర్‌ (అల్గనూరు)లో ఉన్న సీవోఈ కళాశాలల్లో ఫౌండేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు కొత్తగా మరో 8 కళాశాలలను ఎంపిక చేయనున్నారు. అయితే రెండేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉత్తమ కళాశాలలను గుర్తించగా అందులో బెల్లంపల్లి బాలుర సీవోఈ కళాశాలకు ప్రాధాన్యత దక్కింది. గతంలో గుర్తించిన కళాశాలలను ఎంపిక చేస్తారా.. కొత్త కళాశాలలకు ప్రాధాన్యత ఇస్తారా.. అందుకు ఎలాంటి విధివిధానాలను అనుసరిస్తారనేది తేలాల్సి ఉంది.

కళాశాలల ఎంపిక జరగలేదు

సంక్షేమ గురుకులాల్లో 8వ తరగతి నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గడానికి వీలుగా ఫౌండేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇప్పించాలని సొసైటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 కళాశాలలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఏఏ కళాశాలలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది ఇంకా తెలియదు. త్వరలోనే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

– అరుణకుమారి, జోనల్‌ అధికారి,

సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ

విద్యార్థులకు ఫౌండేషన్‌1
1/1

విద్యార్థులకు ఫౌండేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement