
● పాత దానికి కొత్త లేఅవుట్ లింక్ ● ప్రభుత్వ నిబంధనలు
విచారించి చర్యలు తీసుకుంటాం
ఎల్‌ఆర్‌ఎస్ లేకుండా కొత్త లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అలాంటివి జరిగినట్లు నా దృష్టికి రాలేదు. విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగితే రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి నివేదిక పంపించి సదరు సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకుంటాం. డబ్బులకు ఆశపడి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినా.. రిజిస్ట్రేషన్ల కోసం డబ్బులు డిమాండ్ చేసినా.. కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటి వాటిపై ప్రజలు నాకు ఫిర్యాదు చేయవచ్చు.
– రవీందర్‌రావు,
జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా యథేచ్ఛగా సా గుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల ఏర్పా టు చేసిన లేఅవుట్‌లోని ప్లాట్లకూ ఎల్‌ఆర్‌ఎస్–2020లో భాగంగా దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో సదరు సబ్ రిజిస్ట్రార్ ఒక్కో ప్లాట్‌కు రూ.50వేల చొప్పున దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన సదరు అధికారి విధుల్లో చేరిన నుంచి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ అక్రమ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకే ప్రాధాన్యతనిస్తున్నారని ఆశాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. శాఖాపరంగా ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని చెప్పుకొంటున్న ఆ అఽధికారి కార్యాలయంలో ఎవరినీ లెక్క చేయకుండా అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల దందాలో సద రు అధికారి డాక్యుమెంట్ రైటర్లపై పక్షపాత వైఖరి చూపుతుండగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ ఽశివారు పరిధి లోకి వచ్చే సర్వే నంబర్ 77, 78లో ఓ పట్టాదారు తన వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా మార్చాడు. అందులో 45 ప్లాట్లు ఏర్పాటు చేసి వాటిని విక్రయించాడు. పాత లేఅవుట్ కావడంతో వాటి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. అయితే అదే సర్వే నంబర్‌లోగల కొంత భూమిని తాజాగా పట్టాదారు తన కుటుంబీకులకు విక్రయించాడు. ఆ భూమిలోనూ మరో లే అవుట్ ఏర్పాటు చేశారు. ఇటీవలే లేఅవుట్ ఏర్పా టు కావడం, అధికారికంగా ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అందులోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చే సుకునే అవకాశం లేదు. అయితే తాజాగా సదరు లే అవుట్ చేసిన వ్యక్తి పాత లేఅవుట్‌కే కొత్త లేఅవుట్ జతచేశాడు. దానికి సర్వే నంబర్ 77, 78తో పాటు 77ఆ, 78/3/ఆ గా బై నంబర్లను క్రియేట్ చేసి రిజి స్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం 2020కి ముందు లేఅవుట్ చేసి అందులో 10 శాతం ప్లాట్లు విక్రయించినట్లయితే ఎల్‌ఆర్‌ఎస్ కింద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త లేఅవుట్‌లో రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. దీంతో దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు.
అందుబాటులోకి రాని సబ్‌రిజిస్ట్రార్
కాగా, ఈ విషయమై సదరు సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించేందుకు కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్‌లో పలుసార్లు సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

● పాత దానికి కొత్త లేఅవుట్ లింక్ ● ప్రభుత్వ నిబంధనలు