
కైలాస్‌నగర్: వంటగ్యాస్ ఽసిలిండర్ ధర మళ్లీ మండింది. ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలతో లబోదిబోమంటున్న సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ ధరను పెంచింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఇది వరకు ధరల పెంపు కేవలం సాధారణ కనెక్షన్లకే పరిమితం కాగా తాజాగా ఉజ్వల లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తున్నట్లుగా ప్రకటించింది. పెరిగిన ధర మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.1.44 కోట్ల అదనపు భారం పడనుంది.
ఉజ్వల లబ్ధిదారులకు సైతం వర్తింపు..
ఇది వరకు వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపును కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ గ్యాస్ కనెక్షన్ దా రులకు మాత్రమే పరిమితం చేసేది. కానీ తాజాగా పెంచిన ధరను ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తోంది. ఈ కనెక్షన్లన్నీ కేంద్రం నిరుపేదలకే మంజూరు చేసింది. వాటికి రూ.300 స బ్సిడీ ఇచ్చేది. తాజాగా అలాంటి వారిపైనా భారం మోపింది. ఒకవైపు వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు వాటిపై ఇదివరకు ఇస్తున్న సబ్సిడీ కూడా పూర్తిగా ఎత్తివేసింది. నామమాత్రంగా రూ.47 చొప్పున సబ్సిడీ విడుదల చేస్తోంది. అది కూడా తక్కువగా ఉండటంతో ఆ వినియోగదారులు సైతం దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. సబ్సిడీలను రద్దు చేయడం, ఒకేసారి రూ.50 ధర పెంచడంతో వినియోగదారులకు అదనపు భారంగా మారనుంది. కేంద్ర నిర్ణయంపై గ్యాస్ వినియోగదారులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
వినియోగదారులపై తీవ్ర భారం
గతేడాది జూన్‌లో కేంద్ర చమురు సంస్థలు వంట గ్యాస్ ధరను రూ.50 పెంచడంతో పాటు వాటిని తక్షణమే అమల్లోకి తెచ్చాయి. అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను పలుమార్లు పెంచినప్పటికీ గృహావసరానికి వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌పై మాత్రం ఎలాంటి అదనపు ధరను పెంచలేదు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం వినియోగదారులపై భారాన్ని మోపేలా రూ.50 అదనంగా వడ్డించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 2,88,346 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున నెలకు ఒక్కో కనెక్షన్‌పై ఒక సిలిండర్ వినియోగించినా ప్రతీనెల వినియోగదారులపై రూ.1,44,17, 300 అదనపు భారం పడుతోంది. ఒకవైపు నిత్యావసర సరుకులన్నింటి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో పేద, మఽఽధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సిలిండర్ ధర రూ.50 పెంచడంతో వారికి మరింత అదనపు భారంగా మారనుంది.
నిన్నటి వరకు ఎల్‌పీజీ గ్యాస్ ధర : రూ.882
తాజాగా పెంపుతో గ్యాస్ ధర రూ.932
అదనపు భారమే
ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చాలీచాలని జీతాలతో నెట్టుకువస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడం సరికాదు. పెరిగిన ధరలతో మాలాంటి సామాన్యులు ఆర్థికంగా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. గ్యాస్ సబ్సిడీలను ఎత్తివేయడం సరికాదు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.
– గాజరి శశికళ, గృహిణి, ఆదిలాబాద్