
తెరపైకి ‘సోయం’
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి రేసులో బాపూరావు ● అధిష్టానం దృష్టి ఈ మాజీ ఎంపీపై.. ● సీనియర్ కావడంతోపాటు జిల్లాపై పట్టు ● సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరు
సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో తాజాగా సోయం బాపురావు పేరు తెరపైకి వచ్చింది.. పార్టీ అధిష్టానం ఈ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సీనియర్ నేతపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంపై సోయం బాపురావుకు పట్టు ఉండడంతో పార్టీ ముఖ్య నేతలు సీరియస్‌గా పరిశీలన చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ వారం రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమైన పదవిలో ఎవరూ లేకపోవడంతో పార్టీకి దిక్సూచి లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలే నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. ఆదిలాబాద్‌కు కంది శ్రీనివాసరెడ్డి, బోథ్‌కు ఆడే గజేందర్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చెందిన ఆత్రం సుగుణ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. అయితే జిల్లాలో పార్టీ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, పార్టీ బాధ్యతలు మోసే జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో కార్యకర్తల్లో తెలియని శూన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవిని త్వరగా భర్తీ చేయాలని పలుమార్లు డిమాండ్ చేయడం, రాష్ట్రస్థాయిలో ముఖ్య నేతలను కలిసి విన్నవించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
ఇప్పటికై నా ఎంపిక జరిగేనా..
జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇప్పటివరకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి వీరి నుంచే ఎవరినైనా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ప్రధానంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరిగింది. ఈ దిశగా ఆయన కూడా దీనికి సుముఖంగా ఉన్నారనే ప్రచారం పార్టీ కార్యకర్తల్లో జరిగింది. ఆర్థికంగా బలంగా ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందన్న భావన కూడా వ్యక్తమైంది.
ఇక మీనాక్షి నిర్ణయమే తరువాయి..
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి ఉన్న సమయంలో ఆ నలుగురి పేర్లు ప్రచారం జరగగా మీనాక్షి నటరాజన్ రాకతో పార్టీలో పూర్తిస్థాయి పరిశీలన మొదలైంది. ఆ తర్వాతే జిల్లా అధ్యక్షుడిని ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు. తాజాగా సోయం బాపురావు పేరు తెరపైకి రావడం పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రధానంగా ప్రస్తుతం రేసులో ఉన్న ముఖ్య నేతలందరి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో చెప్పుకుంటున్నారు.
సీనియర్ నేత..
సోయం బాపురావు గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు బీజేపీలో కొనసాగారు. 2019లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2004లో బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సోయం బాపురావు కాంగ్రెస్‌లో చేరడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీని వీడారు. మొత్తంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ప్రస్తుతం పార్టీ ఈ జిల్లాలో సీనియర్ నేతపై దృష్టి సారించడంతో ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.