
భానుడి భగభగ
● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● సిరికొండలో 42.7 డిగ్రీలు నమోదు ● ఇళ్లకే పరిమితమవుతున్న జనాలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వారంరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. మంగళవారం జిల్లాలోని సిరికొండ మండలంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ధనోరలో 42 డిగ్రీలు, మంచిర్యాలలోని దేవులవాడలో 41.4, నిర్మల్ జిల్లాలోని తానూరులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే మే లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, తెలంగాణ, అంబేడ్కర్, గాంధీచౌక్‌జనం లేక వెలవెలబోతున్నాయి.
రాష్ట్రంలో జిల్లాలోనే అత్యధికం
రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం 42.7 డి గ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమి తట్టుకోలేక జనాలు ఇళ్లకే పరిమితమై కూ లర్లు, ఏసీలకు పనిచెబు తున్నారు. ఎండ తీవ్రత ను తట్టుకునేందుకు వ్యాపారులు, ఇతర ప నులకు వెళ్లేవారు శీతలపానీయాలు, కొబ్బరి బోండాలు, నిమ్మకా య సోడా తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులుంటాయి. వా నాకాలంలో ఎక్కువ వర్షాలు కురిస్తే, చలి కాలంలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అలాగే వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా లేనివి ధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
అప్రమత్తత అవసరం
ఎండలో పని చేసేవారు వడదెబ్బకు గురయ్యే ప్ర మాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లేవారు గొడుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారన్‌హిట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని పేర్కొంటున్నారు. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయట పడతాయని చెబుతున్నారు. శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయని, శరీర ఉష్ణోగ్రతలు మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నా రు. వృద్ధులు, చిన్నారులకు వేడిగాలి తగిలినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని తెలిపారు.
జిల్లాలో వారం రోజుల ఉష్ణోగ్రతలు
తేదీ కనిష్టం గరిష్టం
1. 22.2 41.3
2. 25.2 41.0
3. 21.7 37.0
4. 24.7 39.8
5. 23.7 36.3
6. 24.2 39.8
7. 24.7 41.3
8. 24.2 42.7
జాగ్రత్తలు పాటించాలి
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగాలి. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి.
– నరేందర్ రాథోడ్,
జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్
అల్లాడుతున్న మూగజీవాలు
ఎండ తీవ్రత కారణంగా జిల్లాలో వాగులు, చెరువులు ఎండిపోయాయి. దీంతో మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో నీటి తొట్టెలు ఉన్నప్పటికీ నిరుపయోగమయ్యాయి. పలు స్వచ్ఛంద సంస్థలు అక్కడక్కడా తొట్టెలను ఏర్పాటు చేసి నీటితో నింపుతున్నా పూర్తిస్థాయిలో మూగజీవాల దాహం తీరడంలేదు.