
పోరాటయోధుడు రాంజీగోండు
● గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కృషి ● ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్: భారత స్వాతంత్రోద్యమంలో అందరినీ ఐక్యం చేసి పోరాడిన యోధుడు రాంజీ గోండు అని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం రాంజీగోండు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పోరాడిన ఘనత రాంజీ గోండుకు దక్కుతుందన్నారు. ఆంగ్లేయులపై ధిక్కార స్వరం వినిపించిన రాంజీతో పాటు మరో వెయ్యి మంది వీరులను ఒకే మర్రిచెట్టుకు ఉరితీసిన చారిత్రక సంఘటనకు నిర్మల్ వేదిక అయిందన్నారు. అలాంటి వీరుడి చరిత్రను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పార్టీ తరఫున సైతం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. బిర్సా ముండా జయంతిని జన జా తీయ గౌరవ దినోత్సవంగా తమ పార్టీ నిర్వహిస్తుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. అలాగే ఆది వాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వారి పురోగతికి పాటుపడుతుందన్నారు. రాంజీ త్యాగాన్ని గుర్తిస్తూ ఆయన పేరు మీదుగా హైదరాబాద్‌లో రూ.25 కోట్లతో మ్యూజియం నిర్మిస్తోందన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కనపర్తి చంద్రకాంత్, భోంస్లే దశరథ్ పటేల్, శేఖర్, బీజేపీ నాయకులు తులసీరామ్, భూమన్న, శైలేందర్ రాజన్న, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.