వైద్యశాఖలో అక్రమ డిప్యూటేషన్లు | - | Sakshi
Sakshi News home page

వైద్యశాఖలో అక్రమ డిప్యూటేషన్లు

Apr 12 2025 2:28 AM | Updated on Apr 12 2025 2:28 AM

వైద్యశాఖలో అక్రమ డిప్యూటేషన్లు

వైద్యశాఖలో అక్రమ డిప్యూటేషన్లు

● నచ్చిన చోటే ల్యాబ్‌టెక్నీషియన్ల విధులు ● ఏజెన్సీ అలవెన్సు తీసుకుంటూ మైదాన ప్రాంతంలో డ్యూటీ

ఆదిలాబాద్‌టౌన్‌: వైద్యశాఖలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిప్యూటేషన్‌లో కొంత మంది ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. తమకు నచ్చిన చోటనే డ్యూటీలు చేస్తున్నారు. మరికొంత మంది ఏజెన్సీ అలవెన్సు పొందుతూ మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొందరు ల్యాబ్‌ టెక్నీషియన్ల తీరు మాత్రం మారడం లేదు. ఇటీవలే బదిలీలు జరిగినా పలువురు ఉద్యోగులు తమకు అనుకూలంగా ఉన్నచోట విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండి రోగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన ల్యాబ్‌టెక్నీషియన్లు రోగుల ఆరోగ్యం పట్టనట్టుగా ఉంటున్నారు. వారికి అనుకూలంగా డ్యూటీ ఉంటే సరిపోతుందనే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. గర్భిణులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆయా పీహెచ్‌సీలకు వైద్య పరీక్షల కోసం వచ్చినప్పుడు ల్యాబ్‌టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌లో ఉన్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టింపులేనితనంగా వ్యవహరించడంతో వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతుంది.

ఏజెన్సీ అలవెన్సులు పొందుతూ

మైదాన ప్రాంతాల్లో..

కొంత మంది ల్యాబ్‌టెక్నీషియన్లు ఏజెన్సీ అలవెన్సు పొందుతూ జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తించడం విమర్శలకు దారితీస్తోంది. తోటి ఉద్యోగులకంటే అదనంగా ఏజెన్సీ అలవెన్సు పొందుతూ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. సైద్‌పూర్‌లో ఏజెన్సీ అలవెన్సు పొందుతున్న ఉద్యోగి జిల్లా కేంద్రంలోని మలేరియా కార్యాలయంలో, అలాగే గాదిగూడలో పనిచేస్తున్న ఉద్యోగి జిల్లా కేంద్రంలోని టీబీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. గిరిజనుల ఆరోగ్యంపై వీరికి శ్రద్ధ లేనట్టుగా తెలుస్తోంది. డిప్యూటేషన్లు బ్యాన్‌ ఉన్నప్పటికీ వీరు అక్రమంగా వారికి నచ్చినచోట పనిచేస్తుండడం గమనార్హం. రాజకీయ నాయకులు, ఇతర అధికారుల అండదండలతో వీరి ఆగడాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

నిబంధనలకు పాతర..

వైద్యశాఖలో ల్యాబ్‌ టెక్నీషియన్లు నిబంధనలకు పాతర వేశారు. తమకు కేటాయించిన పీహెచ్‌సీలో కాకుండా వారికి అనుకూలంగా ఉన్న చోట విధులు నిర్వహిస్తున్నారు. తాంసిలో పనిచేయాల్సిన ల్యాబ్‌టెక్నీషియన్‌ రిమ్స్‌లోని మలేరియా విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. జైనథ్‌లో పనిచేయాల్సిన ల్యా బ్‌ టెక్నీషియన్‌ మలేరియా ల్యాబ్‌లో, సొనా లలో పనిచేయాల్సిన మరో ఉద్యోగి జైనథ్‌లో, జైనథ్‌లో పనిచేయాల్సిన ఎల్టీ మలేరియా విభాగంలో, బజార్‌హత్నూర్‌ పనిచేయాల్సిన ఉద్యోగి సొనాలలో, బేలలో పని చేయాల్సిన ఉద్యోగి రిమ్స్‌లోని టీహబ్‌లో, సైద్‌పూర్‌లో పనిచేయాల్సిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ మలేరియా విభాగంలో, గాది గూడలో పనిచేయాల్సిన ఉద్యోగి టీబీ కార్యాలయంలో.. ఇలా అనేక మంది వారికి అనుకూలంగా ఉన్నచోట విధులు నిర్వహిస్తున్నారు.

డిప్యూటేషన్లు రద్దు చేస్తాం..

నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న వారి డిప్యూటేషన్లను రద్దు చేస్తాం. వంద రోజుల టీబీ కార్యక్రమంలో భాగంగా పలువురికి డిప్యూటేషన్లు ఇచ్చాం. ఇటీవలే కార్యక్రమం పూర్తయింది. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం.

– నరేందర్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement