
ప్రయాణికులకు మెరుగైన సేవలు
● నాందేడ్ డీఆర్‌ఎం ప్రదీప్ కామ్లే ● ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సందర్శన
ఆదిలాబాద్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని నాందేడ్ డీఆర్‌ఎం ప్రదీప్ కామ్లే అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. అమృతభారత్ స్టేషన్, పిట్‌లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ రఘుపతి స్థానిక రైల్వే సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందించారు. అనంతరం డీఆర్‌ఎం మాట్లాడుతూ, స్థానిక సమస్యలను పరిశీలించి డివిజనల్ స్థాయిలో పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న అండర్, ఓవర్ బ్రిడ్జి పనులు, పిట్‌లైన్, అమృత్ భారత్ స్టేషన్ పనులు వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వేకి సంబంధించిన పలు అంశాలను డీఆర్‌ఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని రైల్వే వంతెనల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆలస్యం అవుతుందన్నారు. నిధుల కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించేలా రైల్వే మంత్రి దృష్టికి సైతం తీసుకువెళ్లామన్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా తోడ్పాటు అందించాలని కోరామన్నారు. ఇందులో రైల్వే అధి కారులు, పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.