
ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి
దండేపల్లి: మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు గాండ్ల అశోక్ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై తహాసీనొద్దీన్ కథనం ప్రకారం.. అశోక్ (45) గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. చాలాసేపటి వరకు రాకపోవడంతో ఫోన్ చేస్తే ఇంట్లో ఉంది. దీంతో బంధువు అయిన కార్తీక్‌ను పొలం వద్దకు పంపించారు. పొలం ఒడ్డున ఒక చెప్పు, బావిలో మరో చెప్పు కనిపించింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఈతగాళ్లతో బావిలో వెతకగా మృతదేహం లభించింది. ప్రమాదవశాత్తు బావిలో జారిపడటంతో ఈత రాక అందులో మునిగి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య శైలజ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
బ్లేడ్‌తో గొంతుకోసి హత్యాయత్నం
ఆదిలాబాద్‌రూరల్: బ్లేడ్‌తో ఒకరి గొంతు కోసి హత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని బంగారుగూడలో చోటుచేసుకుంది. ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం..బంగారుగూడకు చెందిన ముద్దంగుల విఠల్, అదేకాలనీలో జాబిర్‌షా ఉంటున్నాడు. గురువారం విఠల్ ఫోన్‌లో ఓ నంబర్ డయల్ చేయాలని జాబిర్ షా అడిగాడు. ఇందుకు విఠల్ ని రాకరించడంతో బ్లేడ్‌తో ఆయన గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలైన విఠల్‌ను రిమ్స్ కు తరలించారు. బాధితుడి భార్య పోచవ్వ ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
ఆరుగురి బైండోవర్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆరుగురు పాత నేరస్తులను గురువారం తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. వేంపల్లిలో దోపిడీ కేసులో నిందితులైన రమేశ్, అవినాశ్, చందు, సంతోశ్, అశోక్, కృష్ణలను ఏడాదిపాటు షరతులతో కూడిన బైండోవర్ చేశారు.