
వీడిన మల్లక్క హత్య కేసు మిస్టరీ
● నిందితుడి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారంపేటలో ఈనెల 13న జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. కాటారం పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు వివరాలు వెల్లడించారు. ఆదివారంపేటకు చెందిన ఒడేటి మల్లక్క (67) భర్త రామయ్య, కుమారుడు రమేశ్ కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. గ్రామంలో కిరాణం నడుపుకుంటూ ఆమె ఒంటరిగా జీవిస్తోంది. మల్లక్క కుమారుడు చనిపోగా కోడలు శ్రీలతకు నిందితుడు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బారెగూడకు చెందిన మోరలే శివ అలియాస్ శివాజీతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు మూడేళ్లపాటు కాగజ్‌నగర్‌లో సహజీవనం చేశారు. శివ వేధింపులు తట్టుకోలేక శ్రీలత అతడిని వదిలిపెట్టి ఆదివారంపేటకు వచ్చి ఉంటోంది. నిందితుడు శివ పలుమార్లు శ్రీలత వద్దకు వచ్చి కలుద్దామని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న శివ ఆమె అత్తను అంతమొందిస్తే ఆస్తి కోసం శ్రీలత హత్య చేసిందని కేసు ఆమె పైకి వెళ్తుందని ప్రణాళిక రచించాడు. పథకం ప్రకారం ఈనెల 12న అర్ధరాత్రి మల్లక్క ఇంటికి వెళ్లిన శివ.. నిద్రిస్తున్న మల్లక్క తలపై గొడ్డలితో బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లక్క మంచంలోనే మృతిచెందగా నిందితుడు గొడ్డలి అక్కడే పడేసి పరారయ్యాడు. మరుసటి రోజు డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, మహదేవపూర్ సీఐ రాంచంద్రరావు, ఎస్సై –2 శ్రీనివాస్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతురాలి కూతురు శ్రీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలు ఆధారాల సాయంతో శివను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు మ్యాక అభినవ్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.