
డేంజర్ బెల్స్
● ఉమ్మడి జిల్లాలో నిప్పుల కుంపటి ● రికార్డుస్థాయిలో 45.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు
జిల్లా కేంద్రంలో తలపై చున్నీలు వేసుకుని
కాలినడకన వెళ్తున్న యువతులు
జాగ్రత్తలు పాటించాలి
ఎండ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి. ఎండలో పనిచేసే వారు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లవద్దు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. కొబ్బరి బోండాలు, పండ్లరసాలతో పాటు అధిక మొత్తంలో నీళ్లు తాగాలి. వడదెబ్బకు గురైతే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలి. – నరేందర్ రాథోడ్,
డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్
ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజురోజుకు పగటి ఉ ష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నిప్పుల కుంపటి తలపిస్తున్నాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల, తాంసి, నిర్మల్ జిల్లా ముధోల్‌లో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా భీమిని, ఆదిలాబాద్ జిల్లా మావలలో 45.1 డిగ్రీలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరిలో 45 డిగ్రీలు నమోదయ్యాయి. రెండుమూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండ తీవ్రతకు జనాలు తల్లడిల్లిపోతున్నారు. పంట పొలాలకు వెళ్లి పనులు చేసుకునే కూలీలు, రైతులు, ఉపాధిహామీ కూలీలు, చిరు వ్యాపారులు ఎండ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 గంటలు దాటినా ఎండ వేడిమితో సతమతం అవుతున్నారు. జనాలు ఇంటినుంచి బయటకు వెళ్లకుండా కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. మూగజీవులకు నీళ్లు దొరకక అల్లాడుతున్నాయి. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రానున్న మే నెలలో దీని తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత పెరిగిపోవడంతో జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

డేంజర్ బెల్స్