
పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ
ఆదిలాబాద్: పరిసరాల పరిశుభ్రతతోనే దోమ ల నియంత్రణ సాధ్యమవుతుందని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్య సిబ్బందికి శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కీటక జనిత వ్యాధుల నివారణపై ముద్రించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాది ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదన్నారు. దీనికి వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, పల్లె దవఖానాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.