400 గ్రామాలకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 8:54 AM | Last Updated on Sat, Feb 25 2023 2:54 PM

పెదబయలు మండలం గిన్నెలకోట రోడ్డులో గెడ్డపై నిర్మిస్తున్న వంతెన - Sakshi

పెదబయలు మండలం గిన్నెలకోట రోడ్డులో గెడ్డపై నిర్మిస్తున్న వంతెన

సాక్షి, పాడేరు: స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మారుమూల గ్రామాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలకు నోచుకోక గిరిజనులు నరకం చూస్తున్నారు. ప్రధాన గెడ్డలు, వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతున్నాయి. ఇలాంటి గ్రామాలు జిల్లాలో 400 వరకు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. గత పాలకులు కూడా మారుమూల గ్రామాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలను పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకులోయ, పాడేరు, రంపచోడవరం ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నాగులాపల్లి ధనలక్ష్మి మారుమూల గ్రామాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా ప్రధాన గెడ్డలు, వాగులపై వంతెన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర సర్వే జరిపించింది. వంతెనలు, కాజ్‌వేలు, కల్వర్టుల నిర్మాణానికి గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు ఐటీడీఏల ద్వారా ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక అందించారు. ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో 21 వంతెనల నిర్మాణానికి పలు పథకాల ద్వారా రూ.22.40 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో..

జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని భారీ వంతెనలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మితమవుతున్నాయి.టెండర్లు పొందిన నిర్మాణ సంస్థలు ఆయా గెడ్డలపై నిర్మాణ పనులను ప్రారంభించాయి. జి.మాడుగుల మండలంలోని అత్యంత మారుమూల కిల్లంకోట పంచాయతీకి పోయే రోడ్డులో కోడుమామిడి గెడ్డ ఉంది.ఈగెడ్డలో నీటి ప్రవాహం నిత్యం అధికంగానే ఉంటుంది. వర్షకాలం మూడు నెలలు గెడ్డ ఉధృతితో గిరిజనులు రాకపోకలు సాగించేందుకు సాహసించరు. గెడ్డను దాటడం అత్యంత ప్రమాదకరం. గెడ్డ అవతల ఆంధ్రాతో పాటు, ఒడిశాకు చెందిన గ్రామాలు అనేకం ఉన్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు ఈ ప్రాంతం సేఫ్టీజోన్‌. వంతెన నిర్మాణం చేపట్టడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి పెదబయలు మండలం జామిగుడ పంచాయతీలో ఉంది. ఒడిశాకు సరిహద్దులో ఉన్న ఈ మారుమూల మావోయిస్టు ప్రభావిత జామిగుడ గిరిజనులకు ప్రభుత్వం న్యాయం చేసింది. గుంజివాడ గెడ్డపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించడంతో పరిసర గిరిజనులతో పాటు ఒడిశా ప్రజల్లో సంతోషం నెలకొంది.

మండలాల వారీగా వివరాలు

కొయ్యూరు: మండపల్లి రోడ్డులో గెడ్డ రూ.కోటి, ఎర్రగొండ రోడ్డులో రూ.2.35 కోట్లు, ఈదులబంద రోడ్డులో రూ.1.3 కోట్లు.

జి.మాడుగుల: కొడిమామిడిగెడ్డపై నిర్మాణానికి రూ.2.2 కోట్లు

పాడేరు: గుత్తులపుట్టులో కల్వర్టు నిర్మాణానికి రూ.30 లక్షలు

ముంచంగిపుట్టు: ఏనుగురాయి రోడ్డులో రూ.80 లక్షలు, గత్తురుమండ రోడ్డులో రూ.35 లక్షలు, బుంగాపుట్టు రోడ్డులో రూ.35 లక్షలు.

పెదబయలు: గుంజువాడ రోడ్డులో రూ.2 కోట్లు, గిన్నెలకోట రోడ్డులో రూ.1.4కోట్లు, పెదలోవ రోడ్డులో రూ.35 లక్షలు, పాతరూడకోట రోడ్డులో రూ.15లక్షలు.

హుకుంపేట: బిసాయిపుట్టు రోడ్డులో రూ.35 లక్షలు, ఆమూరు రోడ్డులో రూ.40 లక్షలు.

అనంతగిరి: జీలుగులపాడు రోడ్డులో రూ.2.20 కోట్లు, శరవన్నపాలెం రోడ్డులో రూ.2 కోట్లు.

డుంబ్రిగుడ: లోగిలిలో రూ.1.8 కోట్లు.

కూనవరం: టేకులోడ్డి రోడ్డులో రూ.50 లక్షలు.

వై.రామవరం: రవ్వగెడ్డ రోడ్డులో రూ.50 లక్షలు, పులిసురిమెట్టలో రూ. 50 లక్షలు, కోట రోడ్డులో రూ.50 లక్షలు

నాణ్యతగా నిర్మాణ పనులు

జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ప్రధాన గెడ్డలు, కొండవాగులపై కల్వర్టులు, వంతెనల నిర్మాణాలను టెండరుదారులు ప్రారంభించారు. ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతగా నిర్మాణ పనులు జరిగేలా చర్యలు చేపట్టాం. అన్ని స్థాయిల్లోని ఇంజనీరింగ్‌ అధికారులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారు. పెద్ద సంఖ్యలో వంతెనల నిర్మాణం జరుగుతుండడంతో గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుంది

– శ్రీనివాస్‌, ముఖ్య ఇంజినీరు, గిరిజన సంక్షేమశాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
జి.మాడుగుల మండలం కోడిమామిడి వంతెన నిర్మాణానికి ఏర్పాటుచేస్తున్న అప్రోచ్‌రోడ్డు1
1/1

జి.మాడుగుల మండలం కోడిమామిడి వంతెన నిర్మాణానికి ఏర్పాటుచేస్తున్న అప్రోచ్‌రోడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement