గృహసారథులకు దిశ నిర్దేశం చేస్తున్న ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
చింతపల్లి: గృహ సారథులే గ్రామాల అభివృద్ధికి వారథులని పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని పెదబరడ పంచాయతీ లోతుగెడ్డ జంక్షన్‌లో శుక్రవారం గృహసారథులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో గ్రామ వలంటీర్లు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని టీడీపీ కుట్రలు పన్నుతోందన్నారు. చంద్రబాబు ఎన్ని నాటకాలు వేసినా ప్రజలు నమ్మరని ఆమె అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు దోహద పడతాయన్నారు.
పాడేరు నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించేందకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జగనన్న పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు నర్సింగరావు, ఎంపీపీ కోరాబు అనూషాదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, కార్యదర్శి పాంగి గణబాబు, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల పార్టీ అధ్యక్షులు మోరి రవి, బొబ్బిలి లక్ష్మణ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, సర్పంచ్‌లు గోపాల్, లలిత, వంతల మహేశ్వరి, పండన్న ఎంపీటీసీలు పద్మ,జయలక్ష్మి, మీనాకుమారి, కో–ఆప్షన్ సభ్యులు షేక్ నాజర్‌వలీ పాల్గొన్నారు.
సంక్షేమ రథసారథులు మీరే
రాజవొమ్మంగి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, ప్రతి 50 కుటుంబాలకు ఇరువురు గృహ సారథులను నియమించారని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. శుక్రవారం గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో మండలంలోని దూసరపాము, అమీనాబాద్ గ్రామాల్లో ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ శింగిరెడ్డి రామకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమాల్లో ఆమె మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచేలా గ్రామసచివాలయ వ్యవస్థను సీఎం రూపొందించారన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా పర్యవేక్షణతోపాటు వారి సమస్యలను గృహసారథులు గుర్తించి ప్రజాప్రతినిధులకు నివేదిస్తే పరిష్కారానికి కృషి జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో టీడీపీ నేతల కుట్ర రాజకీయాలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ పేరిట మంజూరు చేసిన మరుగుదొడ్ల సొమ్ములను బొక్కేశారన్నారు. సంక్షేమ పథకాలను జన్మభూమి కమిటీల పేరుతో కావాల్సినవారికి కట్టబెట్టేవారన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు జగనన్న ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చారన్నారు. అనంతరం సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులకు దిశానిర్దేశం చేశారు. ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కిట్లను అందజేశారు. దూసరపాములో సర్పంచ్ చీడి శివ, అమీనాబాద్‌లో కించు వెంకటలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు. సచివాలయ కన్వీనర్ల మండల ఇన్‌చార్జ్‌గా జడ్డంగి సర్పంచ్ కొంగర మురళీకృష్ణను నియమించినట్లు ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రకటించారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైస్‌ఎంపీపీ చప్పా చంద్రరాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేష్‌రాజు పాల్గొన్నారు.
ఈనాడు ప్రతులు దహనం
తప్పుడు కథనాలను ప్రచురితం చేస్తున్న ఈనాడు పత్రిక ప్రతులను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ నేతలు, ఎల్లోమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.తమ ప్రభుత్వానికి ఉన్న ఆదరణను చూసి ఓర్వలేనితనంతోనే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేతులు కలిపి కావాలనే తప్పుడు ప్రచారానికి కుట్రలకు పూనుకుంటున్నాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment