వారసుల కల సాకారమైన వేళ...
● ఎట్టకేలకు అల్లూరి అనుచరులవారసులకు సమకూరిన ఆవాసాలు
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో
రెండు ఎకరాల కేటాయింపు
● క్షత్రియసేవా సంఘం చొరవతో
రూ.3.5 కోట్లతో భవనాలు నిర్మించిన
నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ
● రేపు ప్రారంభోత్సవం
కొయ్యూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరులైన గాం గంటందొర, మల్లుదొర వారసులకు శాశ్వత ఆవాసాలు సిద్ధమయ్యాయి. పూరిళ్లలో జీవనం సాగిస్తున్న సమరయోధుల వారసుల దుర్భర పరిస్థితిని జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత పడాల వీరభద్రరావు, మరి కొంతమంది నాయకులు గతంలో ప్రభుత్వం, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం... వారసులు నివాసముంటున్న లంకవీధి వద్ద సుమారు రెండు ఎకరాల స్థలం కేటాయించింది. క్షత్రియసేవా సమితి వినతి మేరకు ఇళ్ల నిర్మాణానికి నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ ముందుకు వచ్చింది. 2023 నవంబర్‌లో అప్పటి అరకు ఎంపీ గొడ్డేడి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో అభిషేక్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో రూ.3.5 కోట్లతో రెండు భవనాల్లో 12 ఫ్లాట్లు నిర్మించారు. ఒక్కో ఫ్లాట్‌లో 1,250 చదరపు అడుగుల్లో ఒక హాలు, రెండు బెడ్‌రూమ్‌లు, ఒక వంట గది నిర్మించారు. మల్లుదొర ముని మనుమడు బోడిదొర కిందటి సంవత్సరం అనారోగ్యంతో మరణించగా, ఆయన భార్య అచ్చియ్యమ్మ నాలుగు సంవత్సరాల కిందట మరణించారు. అల్లూరి సీతారామరాజు అమరుడైన వందేళ్ల తరువాత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు సొంత ఇళ్లు సమకూరాయి. బోడిదొర,అచ్చియ్యమ్మ దంపతులు మరణించేంత వరకూ లంకవీధిలో పూరి గుడిసెలోనే ఉన్నారు.
ఫ్లాట్లు అందుకోనున్న వారసులు
గాం గంటం దొర, మల్లుదొర వారసులైన గాం సన్యాసమ్మ, బాబూరావు, నీలకంఠం, రాంబాబు, ధార మల్లేశ్వరి, సీతారామయ్య, సీతమ్మ, రాజుబాబు, శివ, దేశగిరి మల్లమ్మ, యర్రయ్యమ్మలకు ఫ్లాట్లను అందజేయనున్నారు.
అల్లూరి విగ్రహం ఏర్పాటు
రెండు భవనాలకు మధ్యన అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్,తాగునీరు, మరుగుదొడ్లను సమకూర్చారు. సమరయోధుల వారసుల కోసం నిర్మించిన భవనాలను సోమవారం ఉదయం పదిన్నర గంటలకు కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.
అల్లూరి–1,2 గా నామకరణం చేసిన భవనాలు
వారసుల కల సాకారమైన వేళ...
వారసుల కల సాకారమైన వేళ...
Comments
Please login to add a commentAdd a comment