అండ మరిచారు
కొండ దించారు...
ఐటీడీఏ ఫామ్ ప్రవేశ ద్వారం ఆర్చి
తాగునీటి కోసం తంటాలు పడుతున్నకొండరెడ్డి మహిళలు
కష్టాల వలయంలో కొండరెడ్లు
పునరావాస కేంద్రాల్లో ఇక్కట్లు
కూనవరం: పచ్చని ప్రకృతి ఒడిలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఎత్తైన కొండలపై నివసిస్తున్న కొండరెడ్లు మైదాన ప్రాంతానికి తరలివచ్చి కష్టాల సుడిగుండంలో చిక్కి కొట్టు మిట్టాడుతున్నారు. మండల పరిధిలో పైదిగూడెం, ఐటీడీఏ ఫారం, భైరవపట్నం, బండారుగూడెం, గండికొత్తగూడెం తదితర గ్రామాల్లో కొండరెడ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొండలు దిగిరండీ... అండగా మేముంటాము అని రెండు దశాబ్దాల క్రితం అప్పటి ఐటీడీఏ అధికాలు ఇచ్చిన హామీతో సుమారు 50 కుటుంబాలకుపైగా విలీన మండలాల్లోని మైదాన ప్రాంతానికి తరలి వచ్చాయి. ఇళ్లు కట్టిస్తాం, తాగునీరు, సాగునీరు, వ్యవసాయ భూమి వంటి సకల సౌకర్యాలు కల్పిస్తామని వారికి అధికారులు నమ్మబలికారు. అధికారుల మాటలు నమ్మి మైదాన ప్రాంతానికి తరలి వచ్చిన కొండరెడ్లను పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారుల మాటలు నీటిమీద రాతలు అన్న చందంగా మారాయి. తోతులగుట్ట సమీపంలోని ఐటీడీఏ ఫారం పునరావాస కేంద్రంలో ఉన్న కొండరెడ్ల బాధలు వర్ణనాతీతం. మౌలిక వసతులకు నోచుకోక నానా అవస్థలు పడుతున్నారు. కూటూరు గట్టు పరిధిలో ఎత్తైన కొండల్లో కళింగమిద్ది, చింతగండి, పెద్దవాగు తదితర గ్రామాలకు చెందిన 21 కొండరెడ్ల కుటుంబాలు 2000 సంవత్సరంలో పైదిగూడెం ఐటీడీఏ ఫారంకు తరలివచ్చారు. ప్రభుత్వం వారికి పక్కాగృహాలు నిర్మించి, మౌలిక వసతులను గాలికి వదిలేసింది. వ్యవసాయ భూమి సమకూర్చక పోవడంతో కూలిపనులకు వెళుతూ పూట గడుపుతున్నారు. వ్యవసాయ సీజన్ ముగిసిందంటే, వారికి బతుకుదెరువు కరవుతుంది. వేసవిలో తాగునీటి ఎద్దడి తప్పడం లేదని మదనపడుతున్నారు. పాతికేళ్ల కిందట ఇక్కడి వచ్చిన తమకు పిల్లాజల్లాతో మరో 20 కుటుంబాలు తోడయ్యాయని వారికి ఇప్పటి వరకు ఇల్లు, వాకిలీ లేదని వాపోతున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నచందంగా ఐటీడీఏ ఫాంలో 105 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్నా తాము సాగుచేసుకునేందు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment