అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం అవసరం
అనంతగిరి(అరకులోయ టౌన్): అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అరకులోయ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి కోరారు. ఎంపీపీ శెట్టి నీలవేణి అధ్యక్షతన సోమవారం జరిగిన అనంతగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కిషోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. మండల, గ్రామ పంచాయతీల స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో జరిగే అభివృద్ధి పనులను సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు తెలియకుండా ఎలా చేస్తారని అధికారులను ఆమె ప్రశ్నించారు. ఎస్‌ఎంఐ ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో వివిధ పీహెచ్‌సీలలో ఉన్న అంబులెన్స్‌లు మరమ్మతులకు గురయ్యాయని, కొత్త అంబులెన్స్‌లు మంజూరు చేయాలని ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు కోరాగా.. ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఎంపీపీ శెట్టి నీలవేణి మాట్లాడుతూ మండలంలోని కుడియా, చిట్టంపాడు, గుజ్జెలి గ్రామాలలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు కేబినెట్ ఆమోదంపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసేందుకు నిర్లక్ష్యం చేస్తుందన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని ఆ పనులు త్వరితగతిన పూర్తి చేసి తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మండలంలో ఇసుకను తక్కువ ధరకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ దీసరి గంగరాజు కోరారు. లారీ యజమానులతో చర్చించి తక్కువ ధరకు ఇసుకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌కు ఎంపీ సూచించారు. మండల సర్వసభ్య సమావేశాలకు కింది స్థాయి అధికారులు కాకుండా మండల స్థాయి అధికారులు పాల్గొనాలని పాలకవర్గం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వి.మాణిక్యం, ఏఈఈలు గౌతమ్, గణేష్, సీడీపీవో సంతోష్ కుమారి, ఎంఈవో కె.బాలాజీ, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, వైద్యాధికారులు జ్ఞానేశ్వరి, మంజు భార్గవి, ఏపీవో సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ శకుంతల, ఎంపీటీసీలు టి.మితుల, శిరగం అశోక్ కుమార్, తౌటి నాయుడు, ఎం.సన్యాసిరావు, వెంకటరామలక్ష్మి, శోభ తిరుపతమ్మ, కో ఆప్షన్ సభ్యుడు మధీనా, సర్పంచ్‌లు రూతు, పాగి అప్పారావు, జన్ని అప్పారావు, కిల్లో మొష్యా, తదితరులు పాల్గొన్నారు. ఎంపీగా ఎన్నికై మొట్టమొదటి సారిగా మండలానికి విచ్చేసిన ఎంపీ తనూజారాణిని ఎంపీపీ శెట్టి నీలవేణి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, అరకు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, మాజీ జెడ్పీటీసీ గంగన్నదొర, పార్టీ నాయకులు సన్మానించారు.
వేసవిలో తాగునీటి సమస్య రానీయొద్దు
అరకులోయ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి
అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం అవసరం
Comments
Please login to add a commentAdd a comment