నల్లి పేసింది
● మిర్చి పైరుకు నల్లి తెగులు ● దిగుబడులు రాక వరుసగా నాలుగో ఏడాదీ నష్టాలే ● ఆందోళనలో రైతులు
ఎటపాక: ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి తోటలను నల్లి తెగులు నలిపేసింది. వరసగా ఈఏడాదీ మిర్చి రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. నాలుగేళ్ల నుంచి అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటూ మిర్చి పంటను సాగుచేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎంతో ఆశతో సాగు చేసిన వాణిజ్య పంట మిర్చి ఈఏడాది కూడా రైతులతో కంటతడి పెట్టించింది. మొక్క నాటిన దగ్గర నుంచి కంటికి రెప్పలా కాపాడినా.. పూత, పిందె దశకు వచ్చేసరికి వాతావరణ మార్పులతో వైరస్, నల్లి తెగులు సోకి మొక్కలు నలుపు రంగులో మారి ఎండిపోయాయి. ఈ ఏడాది నాలుగు మండలాల్లో పోలవరం ముంపు భూములతో సహా ఆరు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు.ఉద్యానవన శాఖ ఈ క్రాప్ లెక్కల ప్రకారం 2,600 ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్టు గుర్తించారు.
దిగుబడులు,ధరలు పతనం
వరుసగా నాలుగో ఏడాది మిర్చి సాగులో దిగుబడులు తగ్గాయి. పండిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు నష్టాల పాలయ్యారు.ఎకరా మిర్చి తోట సాగుకు సుమారు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఎర్ర, నల్ల నల్లి తెగులు మిర్చి తోటలపై తీవ్ర ప్రభావం చూపడంతో వాటి నుంచి పంటను కాపాడుకునేందుకు ఎన్ని పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది. మిర్చి పూత,పిందె,ఆకుల్లోని రసాన్ని పీల్చివేయటంతో తోటలు నల్లగా మాడిపోయాయి. ఈఏడాది నెలరోజుల ఆలస్యంగా నల్లి ప్రభావం కనపడటంతో ముందుగా పండిన పంటే రైతుల చేతికందింది. ఎకరాకు 25నుంచి 30క్వింటాళ్ల వర కూ మిర్చి దిగుబడి రావలసి ఉండగా కేవలం ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే దిగు బడి వచ్చింది. క్వింటా మిర్చి ధర బహిరంగ మార్కెట్లో ఈఏడాది రూ.13 వేలు మాత్రమే పలుకుతుండడంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. గతంలో క్వింటా ధర రూ.20 వరకు ఉండేది. పెట్టుబడులకు చేసిన అప్పులు కూడా తీరవని రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతూరు మండలంలోని చూటూరు,కూటూరు,ఎటపాక మండలంలో నందిగామ,మురుమూరు, గౌరీదేవిపేట,గన్నవరం, నెల్లిపాక, తోటపల్లి, పిచుకలపాడు,రాయనపేట, గన్నవరం తదితర ప్రాంతాల్లో నల్లి ప్రభావం ఎక్కువగా ఉంది.నాలుగేళ్లుగా ఎర్ర,నల్ల నల్లి రైతులను వెంటాడుతుండటంతో వచ్చే ఏడాది మిర్చి సాగు ప్రశ్నార్థకమే.
నష్టపోయాను
ఎంతో ఆశతో సాగుచేసిన మిర్చి ఈఏడాది కూడా నష్టాల ఊబిలోకి నెట్టింది. 8 ఎకరాల్లో మిర్చి సాగుకు చేస్తే దిగుబడి మాత్రం ఎకరాకు 10 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇలాగే ఉంటే ఇక మిర్చి సాగు చేసే పరిస్థితి ఉండదు.
– దారా రమేష్, రైతు గౌరీదేవిపేట
ఎన్ని మందులు వాడినా ...
ఎర్ర, నల్ల నల్లి తెగుళ్ల నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి చేతికందే సమయంలో నల్లి ప్రభావంతో నాశనమవుతోంది. వేల రూపాయలతో పురుగు మందులు కొని పిచాకారీ చేసినా కల్లెదుటే తోటలు నల్లబడిపోతుంటే తట్టుకోలేక పోతున్నాం.
– యాలం సంతోష్, రైతు నందిగామ
సాగు విస్తీర్ణం తగ్గింది
ఎర్ర,నల్ల నల్లి ప్రభావంతో మిర్చి పంట దెబ్బతినడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీంతో పంట వేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ ఏడాది సాగువిస్తీర్ణం గణనీయంగా తగ్గింది.కొంత ఆలస్యంగా మిర్చి తోటలను ఈఏడాది నల్లి ఆశించింది. దీని ప్రభావంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి.
– ముత్తయ్య, హెచ్‌వో
పురుగు మందుల పేరుతో దగా
రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు పురుగు మందుల దుకాణ దారులు రైతులను దగా చేస్తున్నారు. ఎర్ర,నల్ల నల్లి, ఇతర చీడపీడల నుంచి మిర్చి తోటలను కాపాడుకోవాలనే రైతుల తపన పురుగుమందుల దుకాణదారులకు కాసుల పంట పండిస్తోంది. దుకాణదారులను నమ్మి, వారు చెప్పిన అన్ని పురుగు మందులను అధిక ధరలకు కొనుగోలు చేసి పిచికారీ చేసినా ఫలితం ఉండటంలేదు. కొందరు డీలర్లు తెలంగాణ నుంచి తెచ్చిన మందులను ఈ ప్రాంత గిరిజన రైతులకు అధిక ధరలకు అంటగడుతున్నారు. పండిన కొద్ది పంట సొమ్ము డీలర్ల అప్పలు తీర్చేందుకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లి పేసింది
నల్లి పేసింది
నల్లి పేసింది
Comments
Please login to add a commentAdd a comment