నాటి పోరాటాలతోనే ఈ ప్రాంతానికి ఖ్యాతి
● పర్యాటక సర్క్యూట్ ఏర్పాటుకు చర్యలు
● కలెక్టర్ దినేష్‌కుమార్
● 11 మంది గాం గంటందొర వారసులకు ఫ్లాట్లు అందజేత
● లంకవీధిలో పండగ వాతావరణం
కొయ్యూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గాం గంటందొర, మల్లుదొర తదితరలు చేసిన పోరాటాలతోనే ఈ ప్రాంతానికి గుర్తింపు లభించిందని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. మండలంలోని లంకవీధిలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన రెండు ఎకరాల్లో నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ నిర్మించిన రెండు అపార్టుమెంట్లను ప్రారంభించిన అనంతరం, వాటిలోని 11 ఫ్లాట్లను అల్లూరి సీతారామరాజు అనుచరుడు గాం గంటం దొర వారసులకు కలెక్టర్ దినేష్‌కుమార్, ఎన్‌సీసీ చైర్మన్ దుర్గా ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలని తెలిపారు. ఫ్లాట్లను కేటాయించడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకు ఎన్‌సీసీ ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. నాటి మన్యం యుద్ధంలో నేలకొరిగిన యోధుల వివరాలను నేటి యువతరానికి తెలియజేసేందుకు పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సి ఉందని చెప్పారు.
జిల్లాలో పలు ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాలు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.
రాష్ట్రపతికి ఇచ్చిన మాట నిలుపుకొన్నాం..
ఎన్‌సీసీ చైర్మన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మిస్తామని 2023 సంవత్సరం జులైలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇచ్చిన మాటను నిలుపుకొన్నామని చెప్పారు. ఈ భవనాలు వంద సంవత్సరాల వరకు చెక్కుచెదరవన్నారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా 2022లో భీమవరంలో నిర్వహించిన ఆజాదికా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బోడిదొరతో పాటు కొంతమందిని సన్మానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీలుగా అవసరమైన ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఒక ఫ్లాట్‌ను ఉంచామని తెలిపారు.త్వరలో శిక్షణను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.ఎన్‌సీసీ ఈడీ ఎ.జి.కె. రాజు మాట్లాడుతూ ఎన్‌సీసీ సీఎస్‌ఆర్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడంతో అక్కడి విద్యార్థులు మంచి ప్రతిభ చూపి ఐఐటీలకు ఎంపికయ్యారన్నారు. అనంతరం గంటందొర వారసులు కలెక్టర్‌ను, ఎన్‌సీసీ చైర్మన్‌ను సన్మానించారు. అంతకుముందు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. గంటందొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ను ఎన్‌సీసీ చైర్మన్ తదితరులు సన్మానించగా, వారిని కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణ రాజు, క్షత్రియ సేవా సమితికి చెందిన నానిబాబు, తహసీల్దారు ప్రసాద్, జేఈ రామకృష్ణ, ఎంపీడీవో ప్రసాద్,డీటీ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫ్లాట్లు అందజేయడంతో లంకవీధిలో పండగవాతావరణం నెలకొంది.
నాటి పోరాటాలతోనే ఈ ప్రాంతానికి ఖ్యాతి
నాటి పోరాటాలతోనే ఈ ప్రాంతానికి ఖ్యాతి
Comments
Please login to add a commentAdd a comment