ఆధునిక సాంకేతికతపై అవగాహన అవసరం
విశాఖ విద్య : యువతరం నూతన సాంకేతికతలపై మెరుగైన అవగాహన కలిగి ఉండాలని ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు అన్నారు. సోమవారం వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో జియో ఫిజిక్స్ విభాగం ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘అడ్వాన్సెస్ ఇన్ జియో ఫిజిక్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, అండ్ నేచురల్ రిసోర్సెస్‘ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి సదస్సులు నూతన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయోగంగా నిలుస్తాయని చెప్పారు. జియో ఫిజిక్స్ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని, సాంకేతికతలను పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని చెప్పారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ మాట్లాడుతూ దేశానికి అవసరమైన విలువైన మానవ వనరులను ఏయూ జియో ఫిజిక్స్ విభాగం అందించిందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై అన్వేషణలు జరగాలని సూచించారు. జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డీడీ జి.సుజిత్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదల పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. సుస్థిరమైన భవిష్యత్తుకు, పర్యావరణ సమస్యలకు పరిష్కారాల చూపే విధంగా యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, విభాగాధిపతి ఆచార్య సి.వి.నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
ఏయూ వీసీ ఆచార్య శశిభూషణరావు
జియో ఫిజిక్స్ విభాగం ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment