విద్యార్థులను దండించిన ఉపాధ్యాయులకు నోటీసులు
చింతపల్లి: చింతపల్లిలోని ఈఎంఆర్ ఏకలవ్య పాఠశాలలో చదువుకుంటున్న బాలికలను అక్కడే చదువుకుంటున్న విద్యార్థులు ర్యాగింగ్ చేయగా.. ఆ విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన ఈనెల 11వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏకలవ్య పాఠశాలలో కొంతమంది బాలురు..8వ తరగతి చదువుతున్న బాలికలను ర్యాగింగ్ చేసినట్టు ఉపాధ్యాయులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఉపాధ్యాయులు ఆగ్రహించి సంబంధిత విద్యార్థులను ఈనెల 11వ తేదీ రాత్రి సుమారు రెండు గంటలపాటు మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఇదిలావుండగా తమ పిల్లలను చూసేందుకు సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. దీంతో ఉపాధ్యాయులు దండించిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించారు. ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలు తప్పు చేస్తే సమాచారం ఇవ్వకుండా ఇలా ఇష్టానుసారం హింసించడం ఏంటని ప్రశ్నించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ, గురుకుల అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో మంగళవారం గురుకుల విభాగం వోఎస్‌డీ పీఎస్‌ఎన్‌మూర్తి, చింతపల్లి మండల సహాయ గిరిజన సంక్షేమాధికారి జయనాగలక్ష్మి ఏకలవ్య పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. బాలబాలికలతో వేరువేరుగా మాట్లాడారు. ఉపాధ్యాయులను విచారించారు. విద్యార్థులను దండించిన ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశామని సంఘటపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ మనోజ్‌కుమార్ తెలిపారు.
విద్యార్థులను దండించిన ఉపాధ్యాయులకు నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment