పెదబయలులో ఇద్దరు మృతి
● క్షయతో ఒకరు, రక్తహీనతతో మరొకరు మృతి ● ఆందోళనలో గ్రామస్తులు
పెదబయలు: పెదబయలు పీహెచ్‌సీ పరిధిలోని పెదబయలు గ్రామంలో బుధవారం క్షయ వ్యాధితో ఒకరు, రక్తహీనతతో ఓ మహిళ మృతి చెందారు.పెదబయలు అటవీ శాఖ కార్యాలయం సమీపంలోని వీధిలో నివాసం ఉంటున్న దడియా నాగేశ్వరరావు (30) క్షయ వ్యాధితో బుధవారం మృతి చెందారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన మఠం లక్ష్మీ(31) రక్తహీనతతో బాధపడుతూ పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దడియా నాగేశ్వరరావు అక్క దడియా లలిత (35) గత ఏడాది టీబి వ్యాధితో మృతి చెందింది. గ్రామంలోని టీబీతో ఏడాదిలోనే ఇద్దరు మృతి చెండడంతో స్థానికులు అందోళన చెందుతున్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీ పరిధిలో క్షయ రోగులు 36 మంది ఉండగా పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ పరిధిలో పది మంది ఉన్నారు. రోగుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ కొరవడిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షయ రోగుల పట్ల జాగ్రత్తలు తీసుకొని వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ మాట్లాడుతూ దడియా నాగేశ్వరరావు క్షయకు సంబంధించిన మందులు వాడుతున్నారని, తరచూ మద్యం సేవించడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment