ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ
పాడేరు : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఈనెల 8న ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం పరిధిలో ప్రతి ఐటీడీఏతో పాటు మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కేంద్రం పాడేరులో కనీసం మూడు వేలమందితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన, ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి సత్కరించాలని, వివిధ పథకాల లబ్ధిదారులను గుర్తించి వారికి రుణాల మంజూరు చెక్కులకు అందజేయాలన్నారు. మండల స్థాయిలో మహిళాదినోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. మహిళా ప్రజాప్రతినిధులు, ఎస్‌హెచ్‌జీ మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేసే మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని తెలిపారు. మహిళల విజయ గాథలు అందరికీ తెలియజేయాలని చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వర్చువల్ విధానంలో మాట్లాడారు. రక్షణ, భద్రత, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మహిళలకు తెలియజేయాలన్నారు. మార్చి 8న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న టైలరింగ్ శిక్షణ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మాలత, డీఆర్‌డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, టీడబ్ల్యూ డీడీ రజనీ, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, ఎల్‌డీఎం మాతునాయుడు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి. రవిశంకర్, డీపీఆర్‌వో పి. గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment