భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు
కొమ్మాది: భారత దేశం పుణ్యభూమి అని, సనాతన ధర్మానికి పుట్టినిల్లు అని ఇస్కాన్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీల ప్రభుపాదుల శిష్యుడు, ఆధ్యాత్మిక గురువు హెచ్.జి. కలకాంత్ ప్రభూ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక అన్వేషనలకు మార్గ నిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఆయన భీమిలి బీచ్ రోడ్డు సాగర్‌నగర్ ఇస్కాన్ టెంపుల్‌లో గురువారం సాయంత్రం ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎంతో అదృష్టవంతులని, ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, శ్రీమధ్భాగవతం వంటివి ఎన్నో భారత దేశం నుంచి ఉద్భవించాయని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో ఇస్కాన్ ఎంతగానో ప్రయత్నిస్తోందని, హరినామ సంకీర్తన, సనాతన ధర్మం, భగవంతుని విశిష్టతను ప్రచారం చేయడంలో యువత ముందుకు రావాలని కోరారు. శ్రీకృష్ణుని లీలల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను, అలాగే అర్జునికి యుద్ధసమయంలో చేసిన గీతోపదేశం ద్వారా మనిషి ఎలా ప్రవర్తించి భగవంతుని చేరుకోవాలనే అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షుడు సాంబదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని, వంశీ కృష్ణ ప్రభు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment