రైలు ప్రయాణంలో తోడు.. మేరీ సహేలీ
మహిళా ప్రయాణికులకు రక్షణగా ప్రత్యేక బృందం
సాక్షి, విశాఖపట్నం:
రైల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా భారతీయ రైల్వే.. వినూత్న విధానాలను అవలంబిస్తోంది. ఎవరి తోడు లేకుండా ప్రయాణిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు అనుసరిస్తున్న సరికొత్త ఆలోచనే ‘మేరీ సహేలి’. అంటే.. నా స్నేహితురాలు అని అర్థం. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునేంత వరకూ ఆర్‌పీఎఫ్ ఏర్పాటు చేసిన మేరీ సహేలి బృంద సభ్యులు వారి స్నేహితులుగా తోడుంటారు. అంతేకాదు.. అసౌకర్యాలకు గురవుతున్న మహిళా ప్రయాణికులకు సహాయం చేయడంతో పాటు భద్రతను పెంచే లక్ష్యంతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో ‘సుభద్ర వాహిని’ పేరుతో ప్రత్యేక మహిళా రైల్వే సిబ్బంది బృందం సేవలందిస్తోంది. మేరీ సహేలి, సుభద్ర వాహినిలో మొత్తం 16 మంది మహిళా ఆర్‌పీఎఫ్ సిబ్బంది సేవలందిస్తున్నారు.
మేరీ సహేలీ..: వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రైలు ప్రయాణికుల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలుంటారు. వీరి వివరాల్ని ఆర్‌పీఎఫ్ సేకరిస్తుంది. ఇందుకోసం రైలు ప్రయాణికుల రిజర్వేషన్ల ఆధారంగా ఇలాంటి మహిళల వివరాల్ని గుర్తించేందుకు రైల్వే శాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (క్రిస్) యాప్‌ను వినియోగిస్తోంది. మేరీ సహేలీ బృంద సభ్యులు తమ ట్యాబ్‌ల ద్వారా వివరాలు సేకరించి.. వారి వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తారు. ఏదైనా అవసరం ఉంటే సమాచారం అందించాలంటూ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. రైలుదిగేంత వరకూ వారితో టచ్‌లో ఉంటారు. మహిళల బోగీల్లో పురుషులు చొరబడినా వారిపై కేసులు నమోదు చేస్తుంటారు. ఇలా మహిళల భద్రతకు సంబంధించి విశాఖ స్టేషన్ పరిధిలో గత ఏడాది 1,151 మందిపై కేసులు నమోదు చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 89 కేసులు నమోదు చేసినట్లు ఆర్‌పీఎఫ్ సీఐ కిమిడి రామకృష్ణ తెలిపారు.
సుభద్ర వాహిని : సుభద్ర వాహిని మహిళా ప్రయాణికులను అప్రమత్తం చేయడం, ప్లాట్‌ఫామ్‌లపై, రైళ్లలో మహిళలపై నేర కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. తక్షణ సహాయం కోరుకునేవారు ఎవరైనా ఉంటే సులభంగా గుర్తించడానికి సుభద్ర వాహిని సభ్యులకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. విశాఖపట్నం, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఈ బృందం విడతల వారీగా ప్రయాణిస్తూ మహిళలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. హెల్ప్‌లైన్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపైనా స్పందించి.. వాటిని పరిష్కరించడంలో సుభద్రవాహిని బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా దాదాపు 3500 మంది మహిళలకు రక్షణ కవచంలా సుభద్ర వాహిని బృందాలు వ్యవహరిస్తున్నాయని ఆర్‌పీఎఫ్ సీఐ రామకృష్ణ వివరించారు. మహిళలకు రైల్లో ఏ సమస్య తలెత్తినా కంట్రోల్ రూమ్ 8978080777 నంబర్‌కు గానీ.. రైల్వే టోల్‌ఫ్రీ నంబర్ 139లో సంప్రదించాలని ఆయన మహిళలకు సూచించారు.
మేరీ సహేలీ ద్వారా ప్రతిరోజు 10 మంది మహిళలకు రక్షణ
సుభద్ర వాహిని పేరుతో మరో రక్షణ బృందం
రైలు ప్రయాణంలో తోడు.. మేరీ సహేలీ
Comments
Please login to add a commentAdd a comment