భర్త ప్రోత్సాహం.. ఆమె కల సాకారం
ఏయూ న్యాయకళాశాల ప్రిన్సిపాల్ సీతామాణిక్యం
ఏయూక్యాంపస్: చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత లేని రోజుల్లో 17 ఏళ్ల వయసులో పెళ్లిపీటలపై కూర్చున్నారు. పెళ్లిచూపుల సమయంలో పెళ్లికొడుకు చదువుకుంటావా అని అడిగిన ప్రశ్న ఆమెలో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. అలా భర్త సహకారంతో తన చదువును కొనసాగించారు. నేడు దేశంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వహించే స్థాయికి ఎదిగారు ఆచార్య కె.సీతామాణిక్యం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక సీ్త్ర ఉంటుందంటారు. కానీ ఆచార్య సీతామాణిక్యం విజయం వెనుక ఆమె భర్త తమ్మిరెడ్డి ఉన్నారు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా విద్యపై ఉన్న ఆసక్తితో ఆమెను ప్రోత్సహించారు. ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేసి అనంతరం ఎం.ఏ హిస్టరీ, బ్యాచ్‌లర్ ఆఫ్ లా, ఎం.ఏ ఇగ్లీషు, ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్‌లా(ఎల్‌ఎల్‌ఎం) పూర్తిచేశారు. ఒకవైపు కుటుంబం, పిల్లల బాధ్యతలను నిర్వహిస్తూ ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం నుంచి 2000 సంవత్సరంలో సైబర్ నేరాలపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 2014లో పోస్ట్ డాక్టోరల్ ఇన్ లా(ఎల్‌ఎల్‌డీ)ని అందుకున్నారు. రాష్ట్రం నుంచి ఈ డిగ్రీ సాధించిన తొలి వ్యక్తి ఆచార్య సీతామాణిక్యం కావడం విశేషం. వివాహం, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తన ఆకాంక్షలను సాకారం చేసుకోవచ్చు అనడానికి ఆచార్య సీతామాణిక్యం జీవితం ఒక ఉదాహరణ మాత్రమే.
అనంతరం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఏయూలో 2006లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2021లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 24 జూన్ 2024 నుంచి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment