ముగిసిన ఆదివాసీల ఆత్మ గౌరవ దీక్షలు
పాడేరు : ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల పరిరక్షణ కోసం ఉన్న 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఇందుకోసం అసెంబ్లీలో తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఐటీడీఏ వద్ద అఖిలపక్ష, ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్వహించిన 48 గంటల ఆదివాసీల ఆత్మ గౌరవ దీక్షలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉద్యోగాల భర్తీ కొరకు జీవో నెం.3 పునరుద్దిస్తామని అలా కానీ పక్షంలో ప్రత్యామ్మయ జీఓ విడుదల చేసి శతశాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకు చెందేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మరిచిపోయారన్నారు. దీంతో స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఈ విషయంపై పునారాలోచించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. 1/70 చట్టం సవరణపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వాఖ్యలకు నిరసనగా తాము చేపట్టిన ఏజెన్సీ బంద్‌కు స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు అలాంటి ఆలోచన లేదని ట్విట్టర్ ద్వారా ప్రకటించారని అలా కాకుండా అసెంబ్లీలో, టీఏసీ తీర్మాణం చేసి చట్టాన్ని పటిష్టంగా అమలు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా చేపట్టనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేయాలన్నారు. వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు రాధాకృష్ణ, కిల్లో సురేంద్ర, పొద్దు బాల్‌దేవ్, కురుసా పార్వతమ్మ, సుబ్రమణ్యం, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment