కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ పట్టివేత
● ముగ్గురు పిల్లల అస్వస్థతతో బయటకు వచ్చిన వైనం
● తహసీల్దార్ కార్యాలయానికి స్టాక్ అప్పగింత
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో శనివారం జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ప్రసన్నకుమార్, వినియోగదారుల సేవా సంఘం, పీసా కమిటీ సభ్యులు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్‌ను పట్టుకున్నా రు. ఆయా కూల్ డ్రింక్స్‌ను తహసీల్దార్ కార్యాయానికి తరలించి, సిబ్బందికి అప్పగించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలో గల జర్రెల పంచాయతీ దోనిపుట్టు గ్రామానికి చెందిన కోడా సుబ్బారావు ఈ నెల 1వ తేదీన మండల కేంద్రంలో ఆర్.రాందాసు దుకాణంలో కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసి, గ్రామానికి తీసుకువెళ్లారు. 5వ తేదీన ఆ డ్రింక్‌లను గ్రామంలో ముగ్గురు పిల్లలు తాగారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. చిన్నారులను హుటాహుటిన ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించి, వైద్య సేవలు అందించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో పిల్లలకు ప్రాణాపాయం తప్పినట్టు పలువురు తెలిపారు. ఈ సంఘటనను దోనిపుట్టు గ్రామస్తులు శనివారం స్థానిక జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ప్రసన్నకుమార్, వినియోగదారుల సంఘం, పీసా కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వారంతా రాందాసు దుకాణంలో నిల్వ ఉంచిన కూల్ డ్రింక్స్‌ను పరిశీలించగా నాలుగు నెలల పాటు కాలం చెల్లించిన 230 కేసుల కూల్ డ్రింకులు, 21 వాటర్ బాటిళ్లను గుర్తించారు. దీంతో వాటిని స్థానిక తహసీల్దార్ కార్యాయానికి తరలించి, రెవెన్యూ సిబ్బందికి అప్పగించారు. కాలం చెల్లిన డ్రింక్స్ విక్రయిస్తున్న వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment