విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి
రంపచోడవరం: వాడపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని డోరి అశ్విని ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. వాడపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి బాలిక మృతికి గల కారణాలను గ్రామస్తులు, విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాలిక ఆత్మహత్య చేసుకున్న తరగతి గదిని ఆమె పరిశీలించారు. బెంచీ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడిన తీరుపై మాజీ ఎమ్మెల్యే అనుమానాలు వ్యక్తం చేశారు. అనంతరం వాడపల్లి పీహెచ్‌సీలోని బాలిక మృతదేహాన్ని పరిశీలించి కంటతడి పెట్టారు. మృతురాలి తండ్రి, సోదరిలను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో విద్యాలయాల్లో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. రంపచోడవరం డైట్ కళాశాలలో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురి కావడం, రంపచోడవరం బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినులను గుంజీలు తీయించడంతో కాళ్లు వాచిపోయి ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు. బోదులూరు ఆశ్రమ పాఠశాలలో సస్పెండ్ అయిన వార్డెన్ నెల రోజులు తిరగకుండానే వాడపల్లి ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌గా విధుల్లో చేరారన్నారు. పాఠశాలలో వార్డెన్, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఎవరూ అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. సాయంత్రం అయితే ఎవరూ హాస్టల్‌లో అందుబాటులో ఉండని పరిస్థితిలో మార్పు రావాలన్నారు. పాఠశాలలో సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం బాలిక కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతిపై ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంతో మాట్లాడారు. వార్డెన్, హెచ్‌ఎంలను సస్పెండ్ చేసినట్లు పీవో చెప్పారన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బృందం శ్రీదేవి, ఎంపీటీసీ బచ్చల మంగ, పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment