పర్యాటకాభివృద్ధి పేరుతో గిరిజన చట్టాలకు తూట్లు
చింతపల్లి: ఏజెన్సీలో పర్యాటకాబివృద్ధి పేరుతో గిరిజన చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని దండకారణ్య విమోచన సమితి (డీఎల్వో) కేంద్ర కమిటీ సభ్యుడు మాణిక్యాలరావు అన్నారు. శనివారం చింతపల్లి ఆర్‌ఐటీఐ ప్రాంగణంలో డీఎల్వో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ షెడ్యూల్లోని భూభాగాలలో ఉన్న గిరిజన ప్రాంతాలను స్వయంపాలిత రాష్ట్రాలుగా ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నేటికీ గిరిజన చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. న్యాయస్థానాలు అడవులపై పూర్తి హక్కులు ఆదివాసీలదే అంటున్నా చొరబాటుదారులుగా ముద్ర వేసి దండకారణ్యం నుంచి తరిమివేసే కుట్ర లకు ప్రభుత్వాలు పూనుకొంటున్నాయన్నారు. మన్యం యువతను శిక్షణల పేరిట మైదాన ప్రాంతాలకు తరలించి ప్రణాళిక ప్రకారం ఈ ప్రాంతం నుండి ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అపారమైన సంపదల ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. మన్య ప్రాంతంలో పర్యాటకం పేరుతో విష సంస్కృతికి ప్రభుత్వాలు నాంది పలుకుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుత కమిటీ కాలపరిమితి తీరిందని త్వరలోనే జిల్లా, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో డీఎల్వో సలహాదారు కేశవరావు, రాష్ట్ర అధ్యక్షుడు కోడా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు కె.కాంతారావు, సతీష్‌కుమార్, మార్క్‌రాజ్, కృష్ణ,ప్రసాద్, కాసులమ్మ, వెంకయమ్మ తదితరులు పాల్గొన్నారు.
డీఎల్వో కేంద్ర కమిటీ సభ్యుడు
మాణిక్యాలరావు
Comments
Please login to add a commentAdd a comment