అమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా.. | - | Sakshi
Sakshi News home page

అమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా..

Published Sun, Mar 9 2025 1:11 AM | Last Updated on Sun, Mar 9 2025 1:10 AM

అమ్మ

అమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా..

విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి

రంపచోడవరం: వాడపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న డోరి అశ్విని (11) ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన తీవ్ర విషాదం నింపింది. అమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా.. అక్కా నన్ను క్షమించు.. అని లెటర్‌ రాసి ఆ చిన్నారి బలవన్మరణానికి పాల్పడింది. మహిళా దినోత్సవం రోజున బాలిక ప్రాణాలు తీసుకోవడం అందరి మనసులను కలచివేసింది. వివరాలు.. డోరి అశ్విని ఒకటో తరగతి నుంచి వాడపల్లి ఆశ్రమ పాఠశాలలోనే చదువుతోంది. తల్లి లేకపోవడంతో చిన్నతనం నుంచి మేనత్త, అమ్మమ్మ వద్దే పెరిగింది. శనివారం మధ్యాహ్నం పాఠశాల నుంచి పిల్లల అరుపులు వినిపించడంతో పక్కనే ఇంటికి తాటాకు నేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు పరుగు పరుగున ప్రధాన గేటు వద్ద నుంచి పాఠశాల లోపలకు వెళ్లి చూశారు. పిల్లలు విషయం చెప్పడంతో తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్లే సరికి అశ్విని ఫ్యాన్‌కు వేలాడుతోంది. కిందకు దింపి హుటాహుటిన పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మధ్యాహ్న భోజన సమయంలో..

మధ్యాహ్నం పిల్లలందరూ భోజనానికి వెళ్లిన తరువాత తరగతి గదిలో తలుపులు వేసుకుని రెండు చున్నీలను కలిపి కట్టి, బెంచీ ఎక్కి ఫ్యాన్‌కు బిగించి ఆత్మహత్య చేసుకుంది. అశ్విని భోజనానికి రాలేదని ఎనిమిదో తరగతి పిల్లలు కొంత మంది వెళ్లి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న బాలికను చూసి పెద్దగా అరిచారు. మృతురాలికి తల్లి లేదు. ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. వారిని ఉద్దేశించి ‘అక్కా.. క్షమించు. అమ్మ వద్దకు వెళ్లిపోతున్నా. చెల్లిని బాగా చూసుకో’ అని లేఖలో పేర్కొంది. ఆ లేఖలో ‘వీరి బాధలు పడలేకపోతున్నాను’ అని రాసి ఐదుగురు అమ్మాయిల పేర్లను అశ్విని ప్రస్తావించింది. అసలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. పాఠశాలలో హెచ్‌ఎం, వార్డెన్లు ఇద్దరూ అందుబాటులో లేరు. పాఠశాల సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం పాఠశాలను సందర్శించి విచారణ చేశారు. రంపచోడవరం సీఐ రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి

8లో..

అక్కని క్షమించమని కోరుతూసూసైడ్‌ నోట్‌

చెల్లిని బాగా చూసుకోమని చివరి మాట

బాలిక బలన్మరణంతో వాడపల్లి ఆశ్రమ పాఠశాలలో విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
అమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా.. 1
1/1

అమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement