దగాపడ్డ యువత పోరు బాట
పాడేరు: ఉన్నత విద్య చదువుతున్న పేద విద్యార్థుల కు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్ని చెల్లించకుండా వారి చదువులకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోందని, దీంతో పేద విద్యార్థులు మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 12న జిల్లా కేంద్రాల్లో నిర్వహించే యువత పోరు పోస్టర్లను ఆదివారం సాయంత్రం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు. కానీ నేటికి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 12న జిల్లా కేంద్రమైన పాడేరులో యువత పోరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, జి.మాడుగుల వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ్లన్నదొర, వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, సర్పంచ్ వనుగు బసవన్నదొర, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు లకే రామసత్యవతి, పీసా ఉపాధ్యక్షుడు రమణ, పార్టీ సీనియర్ నాయకురాలు లకే రత్నాబాయి, తదితరులు పాల్గొన్నారు.
12న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పాడేరులో ఆందోళన
పోస్టర్ ఆవిష్కరించిన మత్స్యరాస, రేగం మత్స్యలింగం
Comments
Please login to add a commentAdd a comment