ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటుకు డిమాండ్
చింతూరు: ఆదివాసీల అభివృద్ధికి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక భవనంతోపాటు పరిపాలన యంత్రాంగం సమకూర్చాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు అన్నారు. ఆదివాసీ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం జిల్లా చైర్మన్ రామారావుదొర అధ్యక్షతన ఆదివారం చింతూరులో జరిగింది. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని, ఎల్టీఆర్ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజనేతరుల వలసలను నిరోధించాలని కోరారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే కుట్రలను అడ్డుకోవాలని, దొంగ ఎస్టీ సర్టిఫికెట్ల జారీ నిరోధానికి కృషి చేయాలని అన్నారు. 1986, 2022 నాటి వరద ముంపు ఆధారంగా పోలవరం ముంపు గ్రామాలను రీసర్వే చేసి ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేయాలన్నారు. ప్రస్తుత భూమి విలువ, పరిస్థితులను బట్టి పరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే గ్రామాలను తరలించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల కోసం కాలనీలను నాణ్యతతో నిర్మించడంతో పాటు అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. పోలవరం ముంపు మండలాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని రాజబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సోయం నగేష్, ఒడిశాకు చెందిన మొట్టం రమేష్, ఆదివాసీ జేఏసీ నాయకులు బంగారు వెంకటేశ్వర్లు, తెల్లం శేఖర్, మడివి నెహ్రు, కారం రామన్నదొర, మండల గిరిధర్‌రావు, సోడె మురళి, కుంజా అనిల్, జల్లి నరేష్, ఆత్రం నవీన్, జోగారావు, రాఘవయ్య, నారాయణ, శంకురమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment