12న ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
డుంబ్రిగుడ: ఈనెల 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం డుంబ్రిగుడలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆరు మండలాల పరిధిలో ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించి, పాడేరులో యువత పోరుతో హోరెత్తించాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి చెల్లించాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ప్రభుత్వంపై నిరసన గళం విప్పడానికి ఈ నెల 12వ తేదీన యువత పోరు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో జగన్ ముందుచూపుతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించారని, మిగతా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కల్పించకుండా పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలా వైద్య విద్య చదవాలన్న పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గం పార్టీ సీనియర్ నాయకుడు కమ్మిడి అశోక్‌కుమార్, డుంబ్రిగుడ, అరకులోయ మండల అధ్యక్షులు పి.పరశురాం, స్వాభి రామ్మూర్తి, పోతంగి సర్పంచ్, వైస్ సర్పంచ్‌లు వెంకటరావు, జగ్గునాయుడు, మహిళ నాయకురాలు బబిత పాల్గొన్నారు.
ఆ రోజే యువత పోరు బాట
అరకులోయ ఎమ్మెల్యే మత్స్యలింగం
Comments
Please login to add a commentAdd a comment